2025-26 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన మంత్రి, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. మంత్రి మాట్లాడుతూ.. “తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.” అని అన్నారు.

