Andhra Pradesh Budget Annadata Sukhibhava Scheme: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రతిపాదించింది. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో కీలక పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద.. ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.9వేల400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఏపీ బడ్జెట్‌లో రైతులకు తీపికబురు
- అన్నదాత సుఖీభవ పథకంపై క్లారిటీ
- రూ.9వేల400 కోట్లు కేటాయించారు

రాష్ట్రంలో వ్యవసాయ రంగం 62 శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం అన్నారు పయ్యావుల కేశవ్. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యత ఉన్నా.. ఈ రంగానికి సంబంధించిన అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిల్ని కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తమ ప్రభుత్వం సరఫరా చేస్తోంది అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మథ్యాహ్న భోజన పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలకు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను తమ ప్రభుత్వం మెరుగుపరిచింది అన్నారు. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యం అన్నారు. 2024 ఖరీఫ్ కాలానికి 5.50 లక్షల మంది రైతుల నుంచి 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలచేసి.. తమ ప్రభుత్వం రూ.7,564 కోట్లు అందజేసినట్లు తెలిపారు. రైతులకు డబ్బుల్ని ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోనే చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ధాన్యం బకాయిలు రూ. 1,674 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చింది.


