ఎక్కడైనా ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతుంటే బయ్యర్లకు భయం.. నిర్మాతలకు కంగారు.. దర్శకులకు దడ తప్పదు. కానీ ఇక్కడేంటో మరి.. ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్‌లో వస్తుంటే అంతా ప్రశాంతంగా ఉన్నారు. పైగా వస్తే బాగున్ను అని కోరుకుంటున్నారు కూడా..! ఇదేం లాజిక్..? ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు..? వాళ్లు వస్తున్న సీజన్ ఏంటి..?
తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతికి మించిన సీజన్ మరోటి లేదు. అప్పుడొచ్చిన సినిమాలకు టాక్ కాస్త అటూ ఇటూగా ఉన్నా కలెక్షన్లు మాత్రం రప్ఫాడిస్తుంటాయి. అందుకే అంతా అదే సీజన్‌కు రావాలనుకుంటారు. 2025 పొంగల్ బరిలోనూ చాలా సినిమాలున్నాయి.
అందులో చిరంజీవి విశ్వంభర, రవితేజ 75, వెంకీ అనిల్ సినిమాలు అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చాయి.రవితేజ, వెంకటేష్ బరిలో ఉన్నా.. అగ్ర తాంబూలం మాత్రం విశ్వంభరదే. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
తాజాగా బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుందనే ప్రచారం మొదలైంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మ్యాగ్జిమమ్ 2024లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాలయ్య వస్తే మాత్రం పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎందుకంటే చిరంజీవి ఉన్నారక్కడ. గత పదేళ్ళలో 2017లో ఖైదీ నెం 150, శాతకర్ణి.. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో వచ్చి హిట్ కొట్టారు ఈ ఇద్దరూ. 2025లోనూ ఇదే జరిగితే హిట్ కొడతారని నమ్ముతున్నారు మేకర్స్. బయ్యర్లు కూడా అదే కోరుకుంటున్నారు.