విరాట పర్వం మూవీలోని ఓ సీన్ రియల్ లైఫ్‌లో జరిగింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు రాధ. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు కిరాతకంగా చంపేశారు. నిజంగానే మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారా? అంతలేదంటున్నారు కుటుంబసభ్యులు. పదవి యావతోనే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు.
2018లో మావోయిస్ట్ పార్టీలోకి రాధ
హైదరాబాద్‌లోని బాలాజీనగర్ అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాధ DMLT పూర్తిచేసింది. ఉద్యమం పట్ల ఆకర్షితురాలై 2018లో అడవిబాట పట్టింది. విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. రాధ కాస్త నీల్సోగా పేరు మార్చుకుంది. పార్టీలో చేరిన ఆరేళ్లలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో విప్లవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. పార్టీ సభ్యురాలిగా.. జోన్ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా.. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా రాధ బాధ్యతలు నిర్వర్తించింది.
3 నెలల క్రితం బాధ్యతల నుంచి తొలగింపు
అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదిగిన రాధలో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణారాహిత్యం ఏర్పడిందని పార్టీ గుర్తించింది. మూడు నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి తొలగించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గొంతుకి తాడు బిగించి చంపారు.
మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో పడేసి వెళ్లిపోయారు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. రాధ మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు.
విలాసవంతమైన జీవితం ఆశజూపారనే ఆరోపణ
రాధను ఉద్యమం నుంచి బయటకు తీసుకురావడానికి పోలీసులు ఒత్తిడి చేశారని.. ఆమె తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశ చూపించి లొంగదీసుకున్నారని మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది. ఇందులో భాగంగానే సూర్యం పోలీసులకు ఏజెంటుగా మారాడన్నది లేఖ సారాంశం. తమ్ముడి కుటుంబ దుస్థితి.. పార్టీ రహాస్యాలు చెబితే భారీగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి రాధను లొంగదీసుకున్నారని వెల్లడించింది. కొందరు కోవర్టులతో కలిసి రహాస్యాలను పోలీసులకు చేరవేసినందునే రాధను హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటనలో వెల్లడించింది.
కుటుంబసభ్యులు మాత్రం రాధ అత్యున్నత పదవులు అలంకరించడం గిట్టకే మావోయిస్టులు చంపారని ఆరోపించారు. మావోయిస్టుల లేఖకి.. రాధ కుటుంబసభ్యుల వర్షన్‌కి పొంతనే లేదు. ఇంతకీ ఎవరి వాదనలో నిజమెంత? పోలీసులు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాధ హత్యపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది చూడాలి.