ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు సాధించిన పురోగతిని రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. “గత పదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల కోసం గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ 10 శాతం నుంచి ₹6.75 లక్షల కోట్ల పెట్టుబడులకు చేరింది. ఇది ఆ ప్రాంత అభివృద్ధిని నూతన మార్గంలో తీసుకెళ్లింది” అని చెప్పారు. ఈశాన్య భారతం పురాతన సంస్కృతి, వాణిజ్య వ్యవహారలకు కేంద్ర బిందువుగా ఉన్నట్లు గుర్తు చేశారు. బ్రహ్మపుత్ర, బారక్ నదులు గుండా ఈ ప్రాంతం ఆగ్నేయ ఆసియా, పాశ్చాత్య దేశాలకు మధ్య అనుసంధాన కేంద్రముగా ఉండేదన్నారు.
గతంలో ఈశాన్య రాష్ట్రాలలో కేవలం 9 విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు 17 విమానాశ్రయాలు తయారయ్యాయి. ఇది ఈ ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీతో పాటు ఆర్థిక అభివృద్ధి తీసుకొచ్చిందని సింధియా చెప్పారు. “ఈ ప్రాంతం గతంలో ఎన్నో సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైంది. కానీ, గత 10 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. ఈ మార్పుకు ప్రధాన మంత్రి మోదీనే కారణం.” అని వ్యాఖ్యానించారు.
విదేశీ, దేశీయ పెట్టుబడిదారులను ఈశాన్య రాష్ట్రాలకు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల కీలక వాటాదారులు, ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తలను ఒకే వేదిక వస్తారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే తమ ఉద్దేశమని మంత్రి చెప్పారు. ఉత్తర భారతదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారింది. ఇది దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సింధియా తెలిపారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, వేదాంత గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..