దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఢిల్లీలో ఒకే రోజులో 23 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకావటం కలకలం రేపుతోంది. దీంతో ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 257 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే కరోనా కేసుల పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఢిల్లీలో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలని.. పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే హోమ్ క్వారంటైన్ కావాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే, కర్నాటక రాష్ట్రం బెంగళూరులో 9నెలల చిన్నారికి కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. అటు తెలంగాణలోనూ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా తెలిసింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అనవసరంగా బయటకు వెళ్లకూడదని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం కీలకమని హెచ్చరించారు. కరోనా మళ్లీ వ్యాపించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో రెండు కరోనా కేసులు నమోదైనట్టుగా సమాచారం.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..