నిర్మాతలను ఓటిటి సంస్థలు శాసిస్తున్నాయిప్పుడు. ఒక్కముక్కలో చెప్పాలంటే వాళ్లు తీసిన సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వాళ్లు సొంతంగా డిసైడ్ చేయలేకపోతున్నారు. ఓటిటి వల్ల లాభం భారీగా ఉంటుంది కాబట్టి వాళ్లు సైతం ఏమి మాట్లాడలేకపోతున్నారు.
ఎంత పెద్ద సినిమా అయినా.. ముందు ఓటిటి స్లాట్ దొరికితేనే రిలీజ్ డేట్ లాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమాల రిలీజ్ డేట్స్ డిజిటల్ సంస్థల చేతుల్లోకి వెళ్లి చాలా రోజులైపోయింది. ఇదే మాట నిర్మాతలు కూడా చెబుతున్నారు.
వాళ్లను కాదని మేం ఏమి చేయలేమని నాగవంశీ, బన్నీ వాస్ లాంటి యువ నిర్మాతలే కాదు.. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు కూడా ఓపెన్‌గానే ఒప్పుకుంటున్నారు. అక్కడే అర్థమైపోతుంది ఓటిటి డామినేషన్ ఎలా ఉందనేది..?
డబ్బులు ఇస్తున్నారు కదా అని ఓటిటి సంస్థలు చెప్పిన దానికల్లా ఓకే అంటే తిప్పలు తప్పవేమో..? వాళ్లెంత దూరం వచ్చినా ఓకే కానీ.. కంటెంట్ విషయంలో మాత్రం ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడది కూడా లేకుండా చేస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. రైట్స్ కొనాలంటే.. ముందే మాకు కథ చెప్పాలని కొన్ని ఓటిటి సంస్థలు కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తుంది.
ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కావాలని.. వాళ్లను కలపాలిని ఓటిటి సంస్థలే చెప్తున్నాయి. రేపటి రోజు సెన్సార్ వాళ్ళలా ఎడిటింగ్ టేబుల్‌పై కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..? ఇప్పటికే అగ్రిమెంట్ బ్రేక్ చేసి పోస్ట్ పోన్ చేసిన సినిమాల రేట్స్ 5 శాతం, 10 శాతం అంటూ కోసేస్తున్నారు. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలను కూడా ఓటిటిలు రిజెక్ట్ చేసాయి. ఇది ఎక్కువై కంటెంట్‌లో దూరితే మాత్రం దర్శకులకు చుక్కలు కనిపించడం ఖాయం.