11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఆసనాలు వేసారు. సెలబ్రిటీల నుంచి మొదలు రాజకీయవేత్తల వరకూ అందరూ యోగ ముద్రలు వేశారు. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవి చేసిన యోగాసనాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడు గవర్నర్ అందరి లెక్క ఆసనాలు వేయలేదు. ఆ వీడియో చూసిన వారు తన వయసువారే కాదు.. తన కంటే చిన్నవారు సైతం షాక్ అవుతున్నారు.
గవర్నర్ రవీంద్ర నారాయణ రవి ఏకంగా 51 పుషప్స్ చేసి షాకిచ్చారు. రాష్ట్రానికి తొలి పౌరుడిగానే కాదు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలోనూ తానే ఫస్ట్ ఉంటానని చాటారు. గవర్నర్ ఉత్సాహంగా పుషప్స్ తీస్తుంటే అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక ఆ వీడియో చూసినవాళ్లు ‘వామ్మో 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారేంటీ?’ అని నోరెళ్లబెడుతున్నారు. కొందరేమో ‘మీది మామూలు బాడీ కాదు సార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో యోగా వేడుకలను జరిపింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ రవీంద్ర నారాయణ రవి తన ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుపు రంగు టీషర్ట్, నలుపు ప్యాంట్ ధరించిన ఆయన.. ఏమాత్రం అలుపెరగకుండా వరుసగా 51 పుషప్స్ తీశారు. మాజీ ఐపీఎస్ అయిన రవీంద్ర నారాయణ తన శిక్షణ కాలం నాటి రోజులను మైమరిపించారు. వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపించిన గవర్నర్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.