వైద్య నిపుణులు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు వారాల పాటు రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) పెరగకుండా కూడా ఇది నిరోధిస్తుంది.
గ్రీన్ టీ తాగడం మొదలుపెట్టిన 10 రోజుల తర్వాతే గట్ లో మంచి బ్యాక్టీరియా.. ముఖ్యంగా బైఫిడోబ్యాక్టీరియా వంటి జీవకణాలు పెరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా చేస్తాయి. కాలేయంపై ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గ్రీన్ టీ వల్ల కాలేయానికే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఒక మంచి డ్రింక్ గా పేరు పొందింది. గ్రీన్ టీ తాగే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుందని కూడా నిపుణులు వివరించారు.
గ్రీన్ టీలో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది ఒక సానుకూల అంశం. ఇది మీకు నిద్రలేమి సమస్య ఇవ్వకుండా శక్తిని అందిస్తుంది. అదే సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచడంలో కూడా ఈ టీ సహాయపడుతుంది.
గ్రీన్ టీలో ఉండే సహజ రసాయనాలు.. ముఖ్యంగా మంటను తగ్గించే గుణాలు, రక్తపోటును తగ్గిస్తాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గించగలదు. దీన్ని జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగించవచ్చు.
అంతేకాదు ఎక్కువ కాలంగా గ్రీన్ టీ తాగే వారికి మెదడుకు సంబంధించిన సమస్యలు.. ఉదాహరణకు డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం శరీరానికి పెద్ద మార్పు తీసుకురావచ్చు. అయితే ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.