లోదుస్తులు శరీరానికి కవరింగ్ మాత్రమే కాదు.. ప్రైవేట్ భాగాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఉపయోగపడతాయి. కానీ చాలా మంది లోదుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. అవును.. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. లోదుస్తుల నాణ్యతపై అంతగా శ్రద్ధ చూపరు. మరికొంతమంది లోదుస్తులను శుభ్రం చేయకుండానే రోజుల తరబడి ధరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల లోదుస్తుల సరైన ఎంపికతోపాటు శుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇతర వస్తువులు, ఆహార పదార్ధాలకు ఉన్నట్లే లోదుస్తులకు కూడా గడువు తేదీ (ఎక్స్పైర్ డేట్) ఉంటుంది. దీనిని వస్త్రాలు కొనుగోలు చేసినప్పుడు వాటిపై ప్రింట్ వేయకపోయినా.. ఎన్నిసార్లు ధరించాలి, ఎలా వినియోగించాలి అన్న దానికి ఓ లెక్క ఉందట.
లోదుస్తులకు కూడా గడువు తేదీ ఉందా?
NYU స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఫిలిప్ టియర్నో ప్రకారం.. ఏ లోదుస్తులకూ గడువు తేదీ ప్రింట్ చేయరు. కానీ వాటిని ఎప్పటికప్పుడు మార్చడం చాలా ముఖ్యం. లోదుస్తులు వదులుగా ఉన్నాలేదా చిరిగిపోయి రంధ్రాలు ఉన్నా.. అలాంటి లోదుస్తులను ధరించకూడదు. అంతేకాదు లోదుస్తులను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఒకసారి ధరించిన తర్వాత, లోదుస్తులను మంచి డిటర్జెంట్, డెట్టాల్ నీటితో శుభ్రం చేసుకోవాలి. సరిగ్గా శుభ్రం చేయకపోతే, ప్రైవేట్ భాగాలలో దురద, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
లోదుస్తులను ఎంత తరచుగా మార్చాలి?
ప్రతిరోజూ లోదుస్తులను మార్చుకోవాలని నివేదికలు చెబుతున్నాయి. ఒకసారి ధరించిన లోదుస్తులను ఉతకకుండా ధరించకూడదు. అదేవిధంగా, ఒకే లోదుస్తులను ఎక్కువసేపు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది అలెర్జీలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లోదుస్తులను మార్చాలని నిపుణులు అంటున్నారు. అది చాలా మంచి స్థితిలో ఉన్నప్పటికీ, దానిని మార్చాలి.
ఇవి కూడా చదవండి
లోదుస్తులు చాలా పాతవి, వదులుగా ఉంటే వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే, మీ లోదుస్తులు ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే, వాటిని ధరించకూడదు. మొత్తంమీద వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా, మంచి నాణ్యత గల లోదుస్తులను ధరించడం బెటర్. ప్రతి 6 నెలల తర్వాత వాటిని మార్చుతూ ఉండాలని నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.