ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లల కోసం వారి ఆరోగ్యం కోసం తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్వీట్ చేసి పెడుతారు. ఆ స్వీట్స్ లలో కచ్చితంగా మినప సున్నుండలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్స్. ఈ స్వీట్స్ పిల్లల ఎదుగుదలకు మంచివి. మినుముల్లో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, కాల్షియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కెర వెంటనే శక్తిని అందిస్తుంది.
100 గ్రాముల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా..?
- ప్రొటీన్ – 25 గ్రాములు
- పొటాషియం – 983 మి.గ్రా.
- కాల్షియం – 138 మి.గ్రా.
- ఐరన్ – 7.57 మి.గ్రా.
- నయాసిన్ (Niacin) – 1.447 మి.గ్రా.
- థయామిన్ (Thiamine) – 0.273 మి.గ్రా.
- రిబోఫ్లావిన్ (Riboflavin) – 0.254 మి.గ్రా.
కొంతమంది పిల్లలు నానబెట్టిన బాదం తినరు. దాంతో బాదం పొడి కలిపి సున్నుండలు చేస్తారు. ఈ కొత్త పద్ధతితో చేసిన మినప సున్నుండలు చాలా రుచికరంగా ఉంటాయి. మినుములు ఎలాంటివి అయినా వాడొచ్చు. వేయించిన మినుములే ఎక్కువ రుచిగా ఉంటాయి. జీడిపప్పు, బాదం కలిపితే రంగు కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- మినుములు – 1 కప్పు (వేయించినవి)
- జీడిపప్పు – 1 కప్పు (వేయించినవి)
- బాదం – 1 కప్పు (వేయించినవి)
- చక్కెర – 1 కప్పు
- కరిగించిన నెయ్యి – 1 కప్పు
తయారీ విధానం
ముందుగా నెయ్యిని పక్కన పెట్టుకుని మిగతా అన్ని పదార్థాలను (మినుములు, జీడిపప్పు, బాదం, చక్కెర) విడివిడిగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడులన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా ఈ పొడి మిశ్రమంలో పోస్తూ.. చేతితో చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మినప సున్నుండలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే.. అవి నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ స్వీట్ ను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.
రెసిపీకి సంబంధించి చిట్కాలు
- చక్కెర బదులు బెల్లాన్ని వాడవచ్చు.
- నెయ్యి ఎక్కువ అయితే లడ్డూలు గుండ్రంగా రావు.. కాబట్టి తగినంత మాత్రమే వాడండి.
- బాదం, జీడిపప్పు తియ్యగా ఉంటాయి. కాబట్టి చక్కెర కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది.
- మినుములు తక్కువ మంటపై మెల్లగా వేయించండి. అప్పుడు మాత్రమే అసలైన రుచి వస్తుంది.