
తలను తడిగా చేసి కొద్దిగా బేకింగ్ సోడా పేస్ట్ తీసుకొని నెమ్మదిగా రుద్దాలి. రెండు నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఇది తల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ దీన్ని ఎక్కువ సమయం తలపై ఉంచకూడదు. తల పొడిబారే ప్రమాదం ఉంది.
తాజా పెరుగు తీసుకుని తలపై సమంగా రాసుకోవాలి. ఒక గంట తర్వాత తక్కువ రసాయనాలు కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. పెరుగు శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టుకు మెరిసే రూపాన్ని ఇస్తుంది. మైగ్రేన్ లేదా సైనస్ సమస్య ఉన్నవారు దీన్ని ఉపయోగించకుండా ఉండటం మంచిది.
రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని తలపై అప్లై చేసి అరగంట వదిలేయాలి. తర్వాత షాంపూతో తల కడగాలి. ఇది తల చర్మంలో వేడిని తగ్గించి జుట్టు పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ తల సమస్యల నివారణలో ఇది సహజ మార్గం.
ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసుకొని తలపై అప్లై చేయాలి. 30 నిమిషాలు ఆ మిశ్రమాన్ని ఉంచిన తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయ రసం తల చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇది జుట్టు వేర్లను బలంగా ఉంచి చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
కొంత గోరింటాకు ఆకులను తీసుకొని నూరాలి. అందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని తలపై రాసి కనీసం రెండు గంటలు ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రు సమస్యను తగ్గించడమే కాకుండా తెల్లజుట్టు సమస్యను కూడా నియంత్రిస్తుంది. జలుబు, సైనస్, మైగ్రేన్ ఉన్నవారు దీన్ని వాడకూడదు.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)