బ్లడ్ గ్రూప్ లైన A, B, AB, O నేరుగా వేడిని ఎంతగా భరించగలుగుతామనే దానిపై స్పష్టమైన సంబంధాన్ని కలిగి ఉండవు. అయితే కొన్ని బ్లడ్ గ్రూపు కణాల ఉపరితలాలపై ఉండే యాంటిజెన్ ల ప్రవర్తన వల్ల వేడి పట్ల శరీర స్పందనలో తేడాలు కనిపించవచ్చు. ఈ యాంటిజెన్ లు శరీర కణాల్లో జరిగే ప్రత్యేక రసాయన చర్యల ద్వారా ఏర్పడతాయి. వేడి ఒత్తిడి వచ్చినప్పుడు ఇవి కణాలను రక్షించేలా పనిచేస్తాయి. ఎవరి శరీరంలో ఈ యాంటిజెన్ ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో వారు వేడిని కొంత మెరుగ్గా తట్టుకునే అవకాశం ఉంటుంది.
O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో సాధారణంగా అడ్రినలిన్ అనే హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒత్తిడి లేదా శారీరక శ్రమ సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల వారి హృదయ స్పందన వేగంగా ఉండటంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ శక్తి వినియోగం కారణంగా వారికి వేడి ఎక్కువగా అనిపించవచ్చు.. ఏసీలో ఉన్నా సరే.
AB లేదా B బ్లడ్ గ్రూప్ కలిగిన వారు సాధారణంగా శరీరంలోని రక్తప్రవాహం, రోగనిరోధక వ్యవస్థ ప్రభావం కారణంగా వేడి పట్ల కొంత అనుకూలమైన స్పందన చూపిస్తారు. అయితే ఇది పూర్తిగా ఖచ్చితమైన విషయం కాదు.. ఇంకా దీని గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయి.
బ్లడ్ గ్రూప్ కొన్ని వ్యాధుల మధ్య సంబంధం ఉండవచ్చు. ఉదాహరణకు O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదానికి కొంత వరకు తక్కువగా ఉంటారు. అయితే B లేదా AB బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు గురయ్యే అవకాశం కొంత ఎక్కువగా ఉండవచ్చని పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
స్పష్టంగా చెప్పాలంటే వేడి పట్ల మన శరీరం ఎలా స్పందిస్తుంది అనే విషయంలో బ్లడ్ గ్రూప్ ఒక్కటే కారణం కాదు. ఇంకా ఇతర ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. శరీర బరువు, మెటబాలిజం, ఫిజికల్ ఫిట్ నెస్, నీటి మోతాదు, జీవనశైలి. ఇవన్నీ కలిపి మనం వేడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటామో దానిపై ప్రభావం చూపుతాయి.
మీ బ్లడ్ గ్రూప్ ఏదైనా కావచ్చు. అయితే దాహాన్ని తట్టుకోవడం, తగినంత నీరు తాగడం, గాలి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో ఉండడం, అవసరమైతే సన్ స్క్రీన్ లు ఉపయోగించడం ద్వారా వేడి నుంచి రక్షణ పొందవచ్చు. మీ బ్లడ్ గ్రూప్ వల్ల మీ శరీరానికి ఉన్న ప్రాథమిక లక్షణాలు తెలిసి ఉంటే వాటి ఆధారంగా మరింత మెరుగైన ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది.