నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఏ రకం మద్యం తాగుతున్నారు అన్నది కాదు.. ఎంత మోతాదులో తాగుతున్నారు అన్నదే అసలు సమస్య. అంటే మద్యం రకాలను మిక్స్ చేయడం వల్ల తరచుగా ఎక్కువ మోతాదులో తాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తుంది.
శరీరానికి ఏం జరుగుతుందంటే..?
- తీవ్ర మత్తు.. వివిధ రకాల మద్యం కలిపి తాగినప్పుడు అది చాలా త్వరగా రక్తంలో కలిసిపోయి మత్తు స్థాయిని పెంచుతుంది. కాలేయం నిర్దిష్ట మోతాదుకు మించి పని చేయలేదు.
- డీహైడ్రేషన్.. మద్యం మూత్ర విసర్జనను పెంచుతుంది. బీర్, వోడ్కా, విస్కీ వంటి రకాలను కలిపి తాగితే శరీరం త్వరగా నీటిని కోల్పోయి తలనొప్పి, అలసటగా అనిపించవచ్చు.
- అజీర్ణం, వికారం.. మిక్స్ చేసిన ఆల్కహాల్ కడుపు లోపలి పొరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఆమ్లత్వం, గ్యాస్, వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
- ఆల్కహాల్ పాయిజనింగ్.. మద్యం మోతాదు మించిపోయినప్పుడు ఆల్కహాల్ పాయిజనింగ్ ఏర్పడి తీవ్ర ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
దీర్ఘకాలిక ప్రభావాలు ఏంటి..?
- కాలేయంపై తీవ్ర ప్రభావం.. తరచుగా మద్యం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, హెపటైటిస్, చివరికి లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు మొదలవుతాయి.
- జీర్ణ సమస్యలు.. మద్యం కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది. దీని వల్ల అల్సర్లు, శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చు, ఫలితంగా శరీరం ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- మెదడు పనితీరు మందగించడం.. ఎక్కువ కాలం మద్యం తాగితే మేధస్సు శక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వెర్నికే-కోర్సాకోఫ్ సిండ్రోమ్ వంటి లోపాల వల్ల మెదడు పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది.
- గుండె సంబంధిత సమస్యలు.. మద్యం ఎక్కువగా తాగే వారు అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు.
మద్యం ఎలా తాగినా ప్రమాదమే
ఒకే రకం మద్యం ఎక్కువగా తాగినా.. వివిధ రకాల మద్యం కలిపి తాగినా ఫలితాలు ఒకటే. మొత్తంగా మోతాదు మించి తాగడమే సమస్యలకు ప్రధాన కారణం. కాలేజీ పార్టీల్లోనో, సెలబ్రేషన్లలోనో సరదాగా మిక్స్ చేసి తాగటం ఆరోగ్యానికి హానికరమే.
జాగ్రత్తలు
- మీకు అధిక రక్తపోటు, కాలేయ సమస్యలు, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే మద్యం తాగకూడదు.
- మద్యం సేవించే ముందు, తర్వాత తగినంత నీరు త్రాగాలి.
- మీ శరీర పరిస్థితిని బట్టి మోతాదును నియంత్రించుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)