
రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి తీసుకోవడం ఒక మంచి పద్ధతి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. ఖర్జూరాలు సహజ చక్కెరలతో పాటు ముఖ్యమైన ఖనిజాలుగా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియంలను కలిగి ఉండటం వల్ల ఇవి ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ఐరన్ లోపానికి ఖర్జూరాలు
ఐరన్ తక్కువగా ఉండే వారికి ఖర్జూరాలు మంచి సహాయకారి. ఖాళీ కడుపుతో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు దీని వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పాలతో కలిపి తినడం వల్ల శక్తి మరింతగా పెరుగుతుంది. దీనిలోని ప్రొటీన్లు శరీర కండరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
జీర్ణక్రియకు ఖర్జూరాలు
నానబెట్టిన ఖర్జూరాలు తక్కువ గాఢత ఉన్న చక్కెరలతో పాటు మంచి ఫైబర్ ను కూడా అందిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలో ఉండే కరిగే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెంపు
ఖర్జూరాలలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన మూలకాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో ముఖ్యమైనవి. పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం కూడా ఎముకల బలానికి తోడ్పడతాయి. ఈ రెండు కలిసినప్పుడు శక్తిని ఇచ్చే పవర్ కాంబినేషన్ గా మారుతాయి.
మధుమేహం ఉన్నవారు జాగ్రత్త
ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఉన్నా.. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. వీరు తమ రోజువారీ షుగర్ లెవెల్స్ ను గమనిస్తూ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే పాలతో తీసుకునే ముందు లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్నవారా అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొందరి వ్యక్తులకు పాలు జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.
ఎలా తినాలి..?
సాధారణంగా రాత్రిపూట 2 నుంచి 3 ఖర్జూరాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి ఉంచి.. ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. అలాగే ఆ నీటిని కూడా తాగవచ్చు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి రోజంతా ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మోతాదును నిర్ణయించుకోవడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)