కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలో ఫారెస్ట్ అధికారులు వేటగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంగా ఉన్న బన్నేరూఘట్ట అరణ్యంలో జింకలను వేటాడి మాంసం తరలిస్తున్న ముఠా గుట్టు బట్టబయలు చేశారు. అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు కోలార్, బన్నేరూఘట్ట అరణ్యాల్లో వన్యప్రాణులను వేటాడుతున్న గ్యాంగ్ గురించి ఖచ్చితమైన సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు బెంగళూరు నగర అటవీ శాఖ అధికారులు, జాగృత దళం కలిసి ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా బన్నేరూఘట్ట-నైస్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న ఒక కారును అటవీ శాఖ అధికారులు ఆపి తనిఖీ చేయగా అందులో నాలుగు చనిపోయిన జింకలు, ఒక పంది కళేబరాన్ని గుర్తించారు.
వెంటనే కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితుడు ప్రతాప్ (31) విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు సి.కె.పాళ్యంలో ఉన్న ఒక గోడౌన్‌పై దాడి చేశారు. అక్కడ నిర్వహించిన తనిఖీలో మొత్తం 10 చనిపోయిన జింకలు, ఒక పంది నుండి తీసిన సుమారు 74 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఒక బైక్, కారుతో పాటు రెండు తుపాకులు.. ఒక డబుల్ బ్యారెల్, సింగిల్ బ్యారెల్, 10 బుల్లెట్ మ్యాగజైన్‌లను గుర్తించారు.
ఈ గ్యాంగ్ వన్యప్రాణులను వేటాడుతూ అరణ్య ప్రాంతాల నుంచి మాంసాన్ని తరలిస్తూ వ్యాపారం చేస్తోందని చెబుతున్నారు. గౌడోన్ యజమాని భీమప్పతో పాటు కీలక పాత్ర పోషించిన బాలరాజు, రమేష్ అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అరెస్ట్ అయిన ప్రతాప్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
మొత్తం ఆపరేషన్‌ను ముఖ్య అటవీ సంరక్షణ అధికారి శివశంకర్, ఉప సంరక్షణ అధికారి రవీంద్ర కుమార్, సహాయక అధికారి గణేష్‌ల నేతృత్వంలో విజయవంతంగా అమలు చేశారు. ఈ సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అటవీశాఖ అధికారులను మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని జాతీయ వివరాల కోసం క్లిక్ చేయండి..