AP Minister Vangalapudi Anitha visit on Payakaraopeta Girls Hostel:

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఇటీవల సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌ను వంగలపూడి అనిత సందర్శించారు. హాస్టల్‌లో వసతుల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించిన హోంమంత్రి.. బాలికలతోనే కలిసి భోంచేశారు. అప్పుడే ఆ హాస్టల్‌లో సదుపాయాలు ఎలా ఉన్నాయనేదీ మంత్రి అనితకు బోధపడింది. మంత్రి వంగలపూడి అనిత భోజనంలోనే బొద్దింక రావటంతో.. మంత్రే కాదు, అక్కడున్నవారంతా విస్తుపోయారు.
ఇలాంటి భోజనం పిల్లలకు పెడుతున్నారా అంటూ మంత్రి అనిత వంటమనుషులపై మండిపడ్డారు. స్కూళ్లలో సన్నబియ్యంతో భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేసినా.. చాలాచోట్ల క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని మంత్రి మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుంచి తొలగిస్తే కానీ దారికి రారంటూ వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాక్షాత్తూ హోంమంత్రికే ఇలా జరిగేతే.. విద్యార్థినుల పరిస్థితి ఏంటో అని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.
ఇక హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనకు వచ్చిన సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. భోజనం సరిగా లేదు. భోజనం మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ విషయాలను అన్నింటిని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత.. వీటిపై సమగ్ర విచారణ చేసి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలని సూచించారు. హాస్టల్‌లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.