ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, రైలులో భోజనం కోసం మరో యాప్, రైలు రన్నింగ్ స్టేటస్ లేదా PNR స్టేటస్ తెలుసుకోవడానికి ఇంకో యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ రైల్వే శాఖ సరికొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరు ‘రైల్ వన్'(Rail One). కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను ప్రారంభించారు.
RailOne యాప్‌ను ఆండ్రాయిన్ ఫోన్ వినియోగదారులు Google Play Store నుంచి, ఐఫోన్ వినియోగదారులు Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఇందులో సమ్మిళితం చేసినందున ఇది రైల్వే సూపర్ యాప్ అని రైల్వే మంత్రి అభివర్ణించారు. ఇది భారతీయ రైల్వే అందించే అన్ని డిజిటల్ సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందిస్తుంది. ఇందులో టికెట్ బుకింగ్, రైలు స్థితి, ప్లాట్‌ఫామ్ టికెట్, ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఫిర్యాదులను దాఖలు చేయడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా ఒక్కో సేవ కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సిన పరిస్థితిని ఈ యాప్ తొలగిస్తుంది.
ప్రయాణికుడి విలువైన సమయాన్ని, ప్రయాసను ఆదా చేయడం ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. RailOne యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) అభివృద్ధి చేసింది. దీన్ని IRCTC సర్వర్‌తో అనుసంధించారు. తద్వారా రైల్వే టికెట్ బుకింగ్‌తో పాటు IRCTC అందించే ఇతర సేవలన్నీ పొందవచ్చు. బ్యాంకింగ్ సేవలు, ఈ-కామర్స్ సేవలను అందించే యాప్‌ల మాదిరిగా ఈ యాప్ సురక్షిత లాగిన్ కోసం m-PIN వెసులుబాటును అందిస్తుంది. తద్వారా వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
స్వ-రైల్ IRCTC యాప్‌ను భర్తీ చేస్తుందా?
ఇప్పటికే IRCTC రూపొందించిన యాప్ అందుబాటులో ఉండగా.. ఈ కొత్త Rail One యాప్ ఎలా పనిచేస్తుందన్న సందేహాలు కలగవచ్చు. రైల్‌వన్ యాప్ IRCTC యాప్‌ను పూర్తిగా భర్తీ చేయదు. IRCTC యాప్ ఇప్పటికీ ఉంటుంది. కానీ స్వరైల్(Rail One) రాకతో, ప్రయాణీకులకు మెరుగైన ఎంపిక లభిస్తుంది. స్వరైల్ అనేది IRCTC యాప్ సేవలతో పాటు ఇతర రైల్వే సేవలను కలిపే సూపర్-యాప్. ఈ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడంతో పాటు రైల్వే సేవల్లో లోపాలు, సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను కూడా నమోదు చేసుకోగలరు. అలాగే మెసేజింగ్, సోషల్ మీడియా, ఈ-కామర్స్, చెల్లింపులు, ఇతర సేవలు సూపర్ యాప్‌లో లభ్యమవుతాయి. తద్వారా ఇది పూర్తి రైల్వే డిజిటల్ పర్యావరణ వ్యవస్థగా మారనుంది. ఈ సూపర్ యాప్ డెవలపర్‌లకు, రైల్వేతో అనుసంధానమై వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించనుంది. తద్వారా సేవలను పెద్ద సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంచవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి