ఆరేళ్ల కన్నకొడుకును కిరాతకంగా హత్య చేసిందన్న ఆరోపణలతో అమెరికాలో ఓ మహిళ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారింది. భారత్, మెక్సికన్ మూలాలున్న అమెరికన్ పౌరురాలైన సిండీ రోడ్రిగ్జ్ సింగ్ అనే 40 ఏళ్ల మహిళను ఎఫ్‌బీఐ తమ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’లిస్ట్‌లో చేర్చింది. అంతేకాదు..ఆమె ఆచూకీ తెలియజేసిన వారికి భారీ బహుమతి కూడా ప్రకటించింది. ఈ మేరకు ఆమె జాడ చెప్పిన వారికి బహుమతిగా 25,000 డాలర్ల నుంచి ఏకంగా 2,50,000 డాలర్ల వరకు (సుమారు రూ. 2 కోట్లకు పైగా) ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది.
సిండీ చివరిసారిగా 2023 మార్చి 22న టెక్సాస్‌లో కనిపించింది. తన భర్త అర్ష్‌దీప్ సింగ్, మరో ఆరుగురు పిల్లలతో కలిసి భారత్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానం ఎక్కినట్లు అధికారులు గుర్తించారు. అయితే, హత్యకు గురైనట్టుగా భావిస్తున్న కుమారుడు నోయెల్ అల్వారెజ్ ఆ సమయంలో వారితో లేడని, అతడు వారితో పాటుగా విమానం ఎక్కలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆమె భారత్‌కు పారిపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దెయ్యం ఉందంటూ చిత్రహింసలు:
నోయెల్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి నిరంతరం ఆక్సిజన్ చికిత్స కూడా అవసరం. కానీ, సిండీ మాత్రం తన కొడుకులో దెయ్యం ఉందని ఆరోపించింది. అతను చెడ్డవాడని నమ్మేదని కుటుంబ సభ్యులు, బందవుల ద్వారా తెలిసింది. ఆ కారణంగానే తాను కొత్తగా జన్మనిచ్చిన కవల పిల్లలను నోయెల్ ఏదైనా చేస్తాడని ఆమె ఎప్పుడూ భయపడుతూ ఉండేదని తెలిసినట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే ఆమె నోయెల్‌ను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసింది. డైపర్లు మార్చడం ఇష్టం లేక, ఆమె నోయెల్‌కు తిండి, నీళ్లు కూడా పెట్టకుండా మాడ్చేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక సారి బాలుడు దాహంతో నీళ్లు తాగేందుకు ప్రయత్నించగా, తాళం చెవులతో ముఖంపై కిరాతకంగా కొట్టినట్లు పోలీసు విచారణలో తెలిసింది. 2022 అక్టోబర్‌లో ఆమె కవలలకు జన్మనిచ్చినప్పటి నుంచి నోయెల్ కనిపించకుండా పోయాడు.
అబద్ధాలతో దర్యాప్తును తప్పుదోవ పట్టించి:
2023 మార్చి 20న టెక్సాస్ కుటుంబ సంరక్షణ సేవల విభాగం అభ్యర్థన మేరకు పోలీసులు నోయెల్ కోసం సంక్షేమ తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో సిండీ అధికారులతో అబద్ధాలు చెప్పింది. తన కొడుకు మెక్సికోలో ఉన్న తండ్రి దగ్గర క్షేమంగా ఉన్నాడని చెప్పి తప్పుదోవ పట్టించింది. ఆ తర్వాత కూడా సిండీ నోయెల్ గురించి పలు రకాల కట్టు కథలు చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు.. ఓ సూపర్‌మార్కెట్ పార్కింగ్‌లో ఒక మహిళకు తన కొడుకును అమ్మేశానని చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ కథకు ఎలాంటి ఆధారాలు లేవని మాజీ పోలీస్ చీఫ్ క్రెయిగ్ స్పెన్సర్ తెలిపారు.
కేసులో భాగంగా వీరు భారత్‌కు విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, సిండీ భర్త అర్ష్‌దీప్ ఇంటిలోని కార్పెట్‌ను బయట డస్ట్‌బిన్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. జాగిలాలతో తనిఖీ చేయగా ఆ కార్పెట్ వద్ద మానవ అవశేషాల ఆనవాళ్లు గుర్తించాయి. దీంతో వారిపై అనుమానం మరింత బలపడింది.
ప్రపంచవ్యాప్తంగా గాలింపు:
ఈ కేసుపై ఎఫ్‌బీఐ డల్లాస్ స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ ఆర్. జోసెఫ్ రోథ్‌రాక్ మాట్లాడుతూ… “నోయెల్ అదృశ్యం, అనుమానిత మరణం నార్త్ టెక్సాస్‌లోని ప్రతి ఒక్కరి మదిలో ఇంకా తాజాగా ఉంది. సిండీని ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చడం ద్వారా ఈ కేసును ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ ప్రచారం ద్వారా ఆమెను కచ్చితంగా అరెస్టు చేసి, విచారణ కోసం అమెరికాకు తీసుకువస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
The FBI is offering a reward of up to $250,000 for information leading to the arrest of Cindy Rodriguez Singh. Calls can be made to 1-800-CALL-FBI or to FBI Dallas at 972-559-5000. Tips can also be submitted digitally at https://t.co/gEDOPVZKar. https://t.co/gxbmUuCAPI pic.twitter.com/oHfjnz2HsI
— FBI Dallas (@FBIDallas) July 1, 2025
2023 అక్టోబర్ 31న సిండీపై క్యాపిటల్ మర్డర్ కేసు నమోదు కాగా, నవంబర్ 2న విచారణ నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోయినందుకుగానూ ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సిండీ 5’1″ నుంచి 5’3″ అడుగుల ఎత్తు, గోధుమ రంగు ఛాయతో ఉంటుందని, ఆమె వీపు, కాళ్లు, చేతులపై పచ్చబొట్లు ఉన్నాయని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఆమె ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా 1-800-CALL-FBI నంబర్‌కు కాల్ చేయాలని లేదా tips.fbi.gov వెబ్‌సైట్‌లో సమాచారం ఇవ్వవచ్చని కోరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..