తమిళనాట రాజకీయ వేడి రగిలింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. పార్టీలు ఇప్పటికే సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ దాని మిత్రపక్షాలతో అనేక సమావేశాలు, సభలు నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలను కలుపుకుని ఎలాగైనా ఎన్నికల్లో నెగ్గాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. ముఖ్యంగా ఏపీలో ఉపయోగించిన స్ట్రాటజీని ఇక్కడ కూడా అప్లై చేయాలని భావిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గట్టిగా వినియోగించుకోవాలని.. బీజేపీ ఫిక్స్ అయ్యింది. అందులో భాగంగానే ఇటీవల పలు కార్యక్రమాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తమిళనాడుకు ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగానే ఆయన కూడా పలుమార్లు తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు… రాజకీయ వర్గాల్లో చర్చకు కూడా దారి తీశాయి. ప్రదానంగా ఇటీవల జరిగిన మదురై మురుగన్ భక్తుల సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదవ్వడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.