TTD Warned Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, సమ్మెకు దిగితే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని.. మళ్లీ విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది. భక్తులకు సేవల్లో ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్విమ్స్ డైరెక్టర్ హెచ్చరించారు. సేవలకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటున్నారు.
హైలైట్:
- వారికి టీటీడీ సీరియస్ వార్నింగ్
- కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- ఎస్మా చట్టం ప్రకారం చర్యలు

‘స్విమ్స్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పోరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంత కాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని , టీటీడీ యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని ఉందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్విమ్స్‌లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటిస్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. వైద్య సేవలకు ఆటంకం కల్గిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకుగాను, ఒకసారి ఉద్యోగం తొలగించాక, సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోరనే విషయాన్ని గమనించాలి’ అని స్విమ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కోరారు.