Mohammed Shami’s Estranged Wife Hasin Jahan Issue: భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, అతని మాజీ భార్య హసిన్ జహాన్ మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న న్యాయ వివాదంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, షమీ తన విడిపోయిన భార్య హసిన్ జహాన్, కుమార్తెకు నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై హసిన్ జహాన్ స్పందిస్తూ, షమీ తన వృత్తిని వదులుకోవాలని తనను బలవంతం చేశాడని ఆరోపించారు.
తీర్పు వివరాలు..
జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఇందులో హసిన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు, వారి కుమార్తె ఐరా నిర్వహణ కోసం నెలకు రూ. 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈ భరణం 2018 నుంచి వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దీనితో షమీపై భారీ ఆర్థిక భారం పడనుంది. గతంలో అలిపోర్ కోర్టు ఇచ్చిన తీర్పు (భార్యకు రూ. 50,000, కుమార్తెకు రూ. 80,000) సరిపోదని హసిన్ జహాన్ హైకోర్టును ఆశ్రయించారు.
హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు..
తీర్పు అనంతరం హసిన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ, తన పోరాటానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. “నేను పెళ్లికి ముందు మోడల్‌గా, నటిగా పని చేసేదాన్ని. నాకు ఒక కెరీర్ ఉంది. కానీ, షమీ నన్ను నా వృత్తిని వదులుకోవాలని బలవంతం చేశాడు. నేను ఒక గృహిణిలా జీవించాలని అతను కోరుకున్నాడు. షమీని నేను ఎంతగానో ప్రేమించాను కాబట్టి, అతని నిర్ణయాలను సంతోషంగా అంగీకరించాను. కానీ ఇప్పుడు నాకు సొంత సంపాదన లేదు. నన్ను, నా కూతురిని పోషించాల్సిన బాధ్యత అతనిదే. అందుకే అతను ఈ బాధ్యతను నిరాకరించినప్పుడు మేం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అని ఆమె అన్నారు.
అలాగే, “దేవుడు ఎప్పుడు నేరం చేసిన వారిని క్షమించడు. అతను తన కుమార్తె రక్షణ, భవిష్యత్తు, ఆనందాన్ని చూడలేడు. అతను అన్యాయ మార్గంలో ఉన్నప్పుడు, నేను న్యాయం మార్గంలో ఉన్నందున అతను నన్ను నాశనం చేయలేడు” అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వివాదం నేపథ్యం..
మహ్మద్ షమీ, హసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015లో వారికి కుమార్తె ఐరా జన్మించింది. అయితే, 2018లో హసిన్ జహాన్ షమీపై గృహహింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేయగా, బీసీసీఐ కూడా విచారణ జరిపింది. అయితే, బీసీసీఐ షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
ఈ కేసులో హైకోర్టు తీర్పు తర్వాత, ప్రధాన పిటిషన్‌ను ఆరు నెలల్లోగా పరిష్కరించాలని ట్రయల్ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు షమీ వ్యక్తిగత జీవితంపై, ఆర్థికంగా గణనీయమైన ప్రభావం చూపనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..