England U19 vs India U19, 3rd Youth ODI: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిశాడు. మూడో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 31 బంతుల్లో 86 పరుగులు సాధించి, భారత U19 జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, రికార్డుస్థాయిలో 9 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 277.41తో వైభవ్ క్రీజులో తుఫాను సృష్టించాడు.
సునామీ ఇన్నింగ్స్..
నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఒక్కో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ U19 జట్టు 268 పరుగులు చేయగా, భారత్ U19 జట్టు 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని, అండర్-19 వన్డేలలో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో రిషబ్ పంత్ (18 బంతులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
తన ఇన్నింగ్స్ మొత్తంలో ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేసిన వైభవ్, మైదానం నలుమూలలా బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. ముఖ్యంగా 9 సిక్సర్లతో అండర్-19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మన్‌దీప్ సింగ్ (8 సిక్సర్లు) పేరు మీద ఉంది.
భారత్ U19కు ఆధిక్యం..
వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ U19 జట్టు విజయానికి బలమైన పునాది వేసింది. వైభవ్ ఔటైన తర్వాత, కనిష్క్ చౌహాన్ (43 నాటౌట్), ఆర్‌ఎస్ అంబరీష్ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ U19 జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.
ఐపీఎల్‌లో ఫాంతో రెచ్చిపోతోన్న వైభవ్..
14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గత ఐపీఎల్ సీజన్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి తన సత్తాను చాటాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అరంగేట్ర ఆటగాడిగా నిలిచిన వైభవ్, గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్‌లో ఒక భారత ఆటగాడు సాధించిన వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
వరుసగా అద్భుతమైన ప్రదర్శనలతో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా నిలుస్తున్నాడు. అతని దూకుడు ఆట, రికార్డులు చూస్తుంటే, త్వరలోనే భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..