Anaya Bangar Surgery: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్, ఇప్పుడు అనయ బంగర్ పేరుతో ఒక ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణంలో భాగంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT), లింగ నిర్ధారణ శస్త్రచికిత్స (Gender Affirming Surgery) చేయించుకున్నారు. ఈ ప్రయాణంలో ఎదురైన భావోద్వేగాలు, ఆర్థిక అంశాలపై అనయ కొన్ని విషయాలను వెల్లడించింది.
శస్త్రచికిత్సకు ముందు అనయ భావోద్వేగం..
అనయ బంగర్ తన లింగ నిర్ధారణ శస్త్రచికిత్సకు ముందు ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని పలు సందర్భాల్లో తెలియజేసిన సంగతి తెలిసిందే. తన శరీరం తన మనసుకు సరిపోలకపోవడం (జెండర్ డైస్ఫోరియా) వల్ల ఎంతో బాధను అనుభవించానని, ఈ శస్త్రచికిత్స ద్వారా తన నిజమైన గుర్తింపును పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో తాను ఒక పురుషుడిగా జీవించడం కోసం ఒక “కవచాన్ని” ధరించానని, అది మానసికంగా ఎంతో అలసటను కలిగించిందని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనేది కేవలం భౌతిక మార్పు మాత్రమే కాకుండా, తన మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని ఆమె నమ్మింది. తన ఆపరేషన్‌కు ముందు యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. 7 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, అనయ తన శరీరంలోని ఏ భాగాలకు ఆపరేషన్ జరుగనుందో తెలియజేసింది.
లింగమార్పిడికి ఎంత ఖర్చంటే..
లింగమార్పిడి ప్రక్రియలో భాగంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT), శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అనయ బంగర్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కోసం సంవత్సరానికి రూ. 50,000 ఖర్చు అవుతుందని ఒక షార్ట్స్ వీడియోలో తెలిపింది. లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చు గురించి ఆమె స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఇటువంటి శస్త్రచికిత్సలకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. సాధారణంగా, లింగ మార్పిడి ప్రక్రియలో వివిధ దశలు, శస్త్రచికిత్సలు (రొమ్ముల అభివృద్ధి, జననేంద్రియాల పునర్నిర్మాణం వంటివి), కౌన్సిలింగ్, హార్మోన్ థెరపీ ఉంటాయి. ఈ ఖర్చులు దేశాన్ని బట్టి, శస్త్రచికిత్సా పద్ధతిని బట్టి, వైద్యుల నైపుణ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ మొత్తానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. రొమ్ము పెరుగుదల ఆపరేషన్ మొత్తం ఖర్చు రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ట్రాచల్ షేవ్ ఆపరేషన్ మొత్తం ఖర్చు రూ.2.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
క్రికెట్ కెరీర్, సవాళ్లు..
మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తెగా, అనయకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే, తన లింగమార్పిడి ప్రయాణం క్రికెట్ కెరీర్‌పై ప్రభావం చూపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ మహిళల కోసం క్రికెట్‌లో సరైన నిబంధనలు లేవని, ఇది తనలాంటి వారికి అవకాశాలు లేకుండా చేస్తుందని ఆమె వాపోయింది. ఐసీసీ (ICC) ట్రాన్స్‌జెండర్ మహిళలను అంతర్జాతీయ మహిళల క్రికెట్ నుంచి నిషేధించడం పట్ల ఆమె నిరాశ వ్యక్తం చేశారు. తన టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణ మహిళల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తాను తన దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోవడం బాధాకరమని పేర్కొంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..