Steffan Nero: క్రీడలకు ఎల్లప్పుడూ అడ్డంకులు ఉండవని, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా అంధుల క్రికెటర్ స్టీఫన్ నీరో. బ్రెస్బెన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ (309 పరుగులు) సాధించి అంధుల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించాడు. అతని అద్భుతమైన ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
నీరో అద్భుత ఇన్నింగ్స్..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంక్లూజన్ సిరీస్ (International Cricket Inclusion Series)లో భాగంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జూన్ 14, 2022న, ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగిన స్టీఫెన్ నీరో, న్యూజిలాండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి, అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. జూన్ 14, 2022న బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్టీఫెన్ నీరో కేవలం 140 బంతుల్లో 309 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టీఫెన్ నీరో తన ఇన్నింగ్స్‌లో 49 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అతని ఈ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మసూద్ జాన్ 1998లో దక్షిణాఫ్రికాపై సాధించిన 262 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. నీరో ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా జట్టు 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 541 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి సమాధానంగా, న్యూజిలాండ్ జట్టు 272 పరుగులకే ఆలౌట్ అవ్వగా, ఆస్ట్రేలియా 269 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
సాధారణ క్రికెటర్లతో పోల్చదగిన ప్రదర్శన..
స్టీఫన్ నీరో అంధుల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, సాధారణ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఎనిమిదో ఆస్ట్రేలియన్ ఆటగాడిగా కూడా అతను పేరు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మాన్, బాబ్ సింప్సన్, బాబ్ కౌపర్, మార్క్ టేలర్, మాథ్యూ హేడెన్, మైఖేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇది నీరో అసాధారణ ప్రతిభకు నిదర్శనం.
ప్రేరణాత్మక ప్రయాణం..
పుట్టుకతోనే దృష్టి లోపంతో (congenital nystagmus) బాధపడుతున్న స్టీఫన్ నీరో, పదేళ్ల వయస్సు వరకు సాధారణ క్రికెటర్లతో ఆడాడు. తన దృష్టి లోపం తీవ్రం కావడంతో అంధుల క్రికెట్‌కు మారాడు. క్రికెట్‌తో పాటు గోల్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో కూడా అతను జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. 2017 బ్లైండ్ టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నీరో నిలిచాడు.
స్టీఫన్ నీరో ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్, కేవలం అంధుల క్రికెట్‌కే కాదు, మొత్తం క్రీడా ప్రపంచానికి ఒక గొప్ప ప్రేరణ. ఎలాంటి అడ్డంకులనైనా దాటి విజయం సాధించవచ్చని అతని ప్రదర్శన స్పష్టం చేస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..