ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పూణేలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇంట్లోనే డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు సెల్ఫీ తీసుకుని.. మళ్లీ వస్తానంటూ చెప్పడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 22 ఏళ్ల మహిళ పూణేలోని ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఒక కొరియర్ రాగా.. డెలివరీ బాయ్ ఓటీపీ చెప్పాలని అడిగాడు. దీంతో ఫోన్ కోసం ఆమె లోపలికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన డెలివరీ బాయ్ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బుధవారం రాత్రి 7.30 గంటలకు మహిళకు కొరియర్ రాగా.. డెలివరీ బాయ్ ఓటీపి అడిగాడు. మహిళ ఫోన్ కోసం ఇంట్లోకి వెళ్లగా.. ఆమె వెనకాలే అతడూ వెళ్లాడు. ఎందుకొచ్చావని ఆమె వారించగా.. అతడు ముఖంపై స్ప్రే కొట్టడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు.. ఓ సెల్ఫీ తీసుకుని.. మళ్లీ వస్తానంటూ రాశాడు. స్పృహలోకి వచ్చాక సదరు మహిళ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. మొత్తం 10 టీమ్స్ ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తు్న్నారు. అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.