ఇటీవల కాలంలో డబ్బుల కోసం కంటికిరెప్పలా పెంచిన కన్నవాళ్లనే కడతేర్చుతున్నారు కొందరు కసాయి కొడుకులు. పుట్టినప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా.. అడిగిందల్లా ఇప్పిస్తూ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కన్నవారిపై కనీస కనికరం కూడా చూపట్లేదు. మద్యం, ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవసనాలకు బానిసలైన కన్నవారి పాలిట కాలయములుగా మారుతున్నారు. ఇటీవలే రూ.5లక్షలకు కోసం ఓ కుమారుడు తల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టగా.. తాజాగా ఓ కొడుకు డబ్బుల కోసం తండ్రిని అతికిరాతకంగా హత్య చేశారు. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లాకు చెందిన హనుమంత్ నాయక్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో ఎక్కడా డబ్బులు పుట్టక.. తమ గ్రామంలోని వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మాలని హన్మంతు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి వెళ్లి తనకున్న భూమిని రూ.6లక్షలకు అమ్మేసి. ఆ డబ్బును తీసుకొని హైదరాబాద్ వచ్చాడు.
ఆ డబ్బును హైదరాబాద్‌లోని తమ నివాసంలో భద్రంగా దాచి పెట్టాడు. అయితే తండ్రి డబ్బులు దాచి పెట్టడాన్ని తన కుమారుడు రవీందర్ చూశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన రవీందర్.. తండ్రి దానిన డబ్బులోంచి రూ. రెండున్నర లక్షలు నొక్కేశాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టుబడిగా పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. అయితే ఇంట్లో డబ్బులు తక్కువగా ఉండడాన్ని గమనించిన తండ్రి.. పోయిన డబ్బు గురించి కొడుకు రవీందర్‌ను అడిగాడు. దీంతో రవీందర్ తానే తీశానని ఫ్రెండ్‌కి అవసరం ఉంటే ఇచ్చానని.. త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాడని చెప్పాడు. డబ్బుల గురించి అడిగిన ప్రతిసారి అదే రీజన్ చెప్పడంతో రవీందర్‌పై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తండ్రి డబ్బు గురించి అదే పనిగా ప్రశ్నిస్తూ ఉండటంతో.. దీనికి చెక్ పెట్టాలనుకున్న తనయుడు ఏ కొడుకూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన తండ్రిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం తన ఫ్రెండ్ డబ్బులు తిరిగి ఇస్తున్నాడని చెప్పి.. తండ్రి హనుమంత్ నాయక్‌ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ముందుగా పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తనకేం తెలియనట్లు.. తన బావకు కాల్ చేసి నాన్న ఆత్మహత్య చేసుకని చనిపోయాడంటూ కొత్త నాటకానికి తెరలేపాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే హన్మంత్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో హనుమంతు నాయక్ సోదరుడు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిద్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత హన్మంత్ నాయక్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆన్‌బైట్టింగ్ వ్యవహారకే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.