చాలా మంది తమ నగలు, ముఖ్యమైన పత్రాలను భద్రత కోసం బ్యాంకు లాకర్‌లో ఉంచుతారు. సామాన్యులకు లాకర్ అనేది దొంగతనం వంటి ప్రమాదాలను నివారించడానికి తమ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.
కానీ మీరు మీ లాకర్‌ను ఎక్కువ రోజులు తెరవనట్లయితే బ్యాంకు మీ అనుమతి లేకుండానే లాకర్‌ను ఓపెన్ చేయవచ్చనే విషయం మీకు తెలుసా? అంతేకాకుండా, లాకర్ దొంగతనానికి గురైనా లేదా ఏదైనా అగ్ని ప్రమాదంలో నష్టపోయినా మీ వాస్తవ నష్టానికి బ్యాంకు నుండి అంత పరిహారం లభించకపోవచ్చు. మరి లాకర్లకు సంబంధించిన నియమాలను ఏమిటో తెలుసుకుందాం.
లాకర్ ఎలా పొందాలి?
బ్యాంక్ లాకర్ పొందడానికి మీరు కొన్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేయాలి. పాన్, ఆధార్ కార్డు లాగా మీ ఫోటో, నామినీ వివరాలను బ్యాంకుకు ఇవ్వాలి. మీకు ఆ బ్యాంకులో ఖాతా ఉండవలసిన అవసరం లేదు. కానీ చాలా బ్యాంకులు లాకర్‌కు బదులుగా పొదుపు ఖాతాను తెరవమని మిమ్మల్ని అడగవచ్చు. మీరు లాకర్ సౌకర్యాన్ని పొందిన తర్వాత బ్యాంకు దాని యాక్సెస్, ఉపయోగం గురించి సమాచారాన్ని రికార్డులో ఉంచుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. మీరు లాకర్ కోసం స్టాంప్ పేపర్‌పై ఒక ఒప్పందంపై సంతకం చేయాలి. ఏదైనా వివాదంలో తలెత్తినప్పుడు ఈ ఒప్పంద కాపీ అవసరం. అందుకే దానిని సురక్షితంగా ఉంచండి.
మీరు ఎంత చెల్లించాలి:
బ్యాంకులో లాకర్ తీసుకోవాలంటే మీరు దానికి అద్దె చెల్లించాలి. అది ఎంత వసూలు చేస్తుందనేది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా ఇది 1000 నుండి 1500 రూపాయలు ఉంటుంది. దీనితో పాటు బ్యాంకు మిమ్మల్ని కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని కూడా అడగవచ్చు. దీనిలో మీరు మూడు సంవత్సరాల అద్దెకు సమానమైన మొత్తాన్ని, లాకర్ ఖాతా తెరవడానికి అయ్యే ఛార్జీని డిపాజిట్ చేయాలి. మీరు మీ లాకర్ కీని పోగొట్టుకుంటే దానిని తెరవడానికి మీరు బ్యాంకుకు బ్రేక్ ఓపెన్ ఛార్జ్ చెల్లించాలి. దీనితో పాటు, లాకర్ తెరిచినప్పుడు మీరు అక్కడ ఉండటం తప్పనిసరి.
బ్యాంకు మీ లాకర్‌ను ఎప్పుడు ఓపెన్ చేయవచ్చు?
దొంగతనం, అగ్నిప్రమాదం లేదా దోపిడీ కారణంగా మీ బ్యాంక్ లాకర్‌లో ఉంచిన వస్తువులకు మాత్రమే బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంలో లాకర్ హోల్డర్‌కు లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు వరకు బ్యాంక్ పరిహారం ఇస్తుంది. ఉదాహరణకు లాకర్ అద్దె సంవత్సరానికి రూ. 1000 అనుకుందాం.. అప్పుడు ఈ సందర్భంలో బ్యాంక్ లాకర్ హోల్డర్‌కు రూ. 1 లక్ష పరిహారం ఇస్తుంది.
ఇది కాకుండా, మీరు మీ లాకర్‌ను 7 సంవత్సరాలు ఉపయోగించకపోతే లేదా లాకర్‌పై ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే, బ్యాంక్ మీ అనుమతి లేకుండా దాన్ని తెరవవచ్చు లేదా మీ నామినీ లేదా చట్టపరమైన వారసుడికి అప్పగించవచ్చు. దీని కోసం నామినీ లేదా చట్టపరమైన వారసుడు 15 రోజుల్లోపు చెల్లుబాటు అయ్యే పత్రాలతో క్లెయిమ్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి