కోవిడ్ ప్యాడమిక్ తర్వాత గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే కరోనా సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, వ్యాక్సిన్ ప్రభావంతోనే చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారనే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇటీవలె కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హసన్ జిల్లాలో మాట్లాడుతూ గుండెపోటు మరణాలను కోవిడ్-19 వ్యాక్సిన్‌తో ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కు అలాంటి సంబంధం లేదని ఖండించింది. వ్యాక్సిన్ సురక్షితమైనది, శాస్త్రీయంగా ధృవీకరించబడింది అని పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సిన్లకు, ఆకస్మిక గుండెపోటు మరణాలకు మధ్య ఎటువంటి సంబంధాలు ఇటీవలె ICMR, AIIMS చేసిన రెండు పెద్ద-స్థాయి అధ్యయనాలను ఉటంకిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రకటనను సీరమ్ సంస్థ గుర్తు చేసింది.
సిద్ధరామయ్య ఏమన్నారంటే..?
అయితే కాంగ్రెస్ నేత, కర్ణాటక సీంఎ సిద్ధరామయ్య వ్యాక్సిన్లకు తొందరపడి ఆమోదం తెలిపారని, హసన్‌లో ఇటీవల జరిగిన గుండెపోటు మరణాలకు టీకా డ్రైవ్‌తో సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు అకస్మాత్తుగా పెరగడంపై సిద్ధరామయ్య ఉన్నత స్థాయి దర్యాప్తునకు కూడా ఆదేశించారు. గత 40 రోజుల్లో జిల్లాలో 24 గంటల వ్యవధిలో మొత్తం 21 గుండెపోటు మరణాలు సంభవించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం డాక్టర్ సిఎన్ మంజునాథ్ నేతృత్వంలోని నిపుణుల ప్యానెల్ ఏర్పాటును ప్రకటిస్తూ కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాలను కూడా సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. యువకులు, ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎందుకు అకస్మాత్తుగా మరణిస్తున్నారు? అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
వైద్యులు ఏమంటున్నారు..?
ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ రాజీవ్ నారంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గుండెపోటుతో మరణించే యువకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు. ఈ మరణాలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మధ్య సంబంధాలపై పెరుగుతున్న ఊహాగానాలను ఆయన ప్రస్తావించారు. ICMR, AIIIMS చేసిన అధ్యయనంలో COVID వ్యాక్సిన్లు తీసుకున్న వారికి, వాస్తవానికి ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. రెండు మోతాదులు పొందిన వారికి ఆకస్మిక మరణం వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గాయి. COVID వ్యాక్సిన్ వాస్తవానికి ప్రయోజనకరంగా ఉందని, నిజంగా హానికరం కాదని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది అని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి