అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో పచ్చక పరుచుకుని గ్రామాల్లో సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లోని చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారి.. అదనంగా వచ్చిన వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. ఈ వరద నీటి ప్రవాహంతో పాటు చెరువుల్లో ఉన్న చేపలు కూడా పొలాల్లోకి వచ్చిపడుతున్నాయి.
స్థానిక వీరభద్రపురం గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న చెరువుల్లో వరద ఉధృతికి చేపలు కలింగుల వద్ద నుంచి నేరుగా పంట పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో స్థానికులు కర్రలు, దోమ తెరలను చేతబట్టి చేపల కోసం పొలాల్లోకి దిగారు. వర్షపు చినుకుల్లో తడుస్తూ, బురదలో నడుస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ.. చేపల వేటలో మునిగిపోతున్నారు. అంతే కాదండోయ్… జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా ఈ చేపల కోసం ఆరాటపడటం విశేషం. ఓ వైపు జోరు వాన, మరోవైపు జలపుష్పాల జాతర… వాటే సీన్ కదా..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.