ఈ మధ్య కాలంలో చిన్న, చిన్న విషయాలకే కొంతమంది చంపడం వరకు వెళ్తున్నారు. కారణమేదైనా ఇతరుల ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ తర్వాత చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ క్షణికావేశంలో చేశామని బాధపడుతున్నారు. మరికొంతమందిలో ఆ పశ్చాతాపం కూడా కనిపిస్తలేదు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. పని కల్పించి అన్నం పెట్టినవారినే దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో కుల్దీప్ సేవానీ భార్య రుచికా సేవానీ, కొడుకు క్రిష్ తో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో బిహార్ కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడు కూడా ఇంట్లో మనిషిలా ఉండేవాడు. దీంతో ఫ్యామిలీ అంతా అతడిని బాగా నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకమే ఇద్దరి ప్రాణాలు తీసింది. తల్లీ కొడుకును ముఖేష్ దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎందుకు చంపావని కూపీ లాగితే అసలు విషయం చెప్పాడు.
ఓ పని విషయంలో ముఖేష్ ను రుచికా తిట్టింది. దీంతో కోపోద్రిక్తుడై ముఖేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన కొడుకును సైతం చంపేశాడు. రాత్రి కుల్దీప్ ఇంటికొచ్చాక భార్య ఎంతకూ డోర్ తీయకపోవడంతో అతడికి డౌట్ వచ్చింది. మెట్ల వద్ద రక్తం మరకలు కనిపించడంతో ఏదో జరిగిందని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు డోర్ బద్దలుకొట్టి చూడగా లోపల మంచం పక్కన రుచికా సేవానీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొడుకు క్రిష్ బాత్ రూమ్ లో విగతజీవిగా కనిపించడంతో కుల్దీప్ బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదే సమయంలో ఇంట్లో పనిచేసే ముఖేష్ కనిపించకుండా పోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కోసం గాలించగా..స్వస్థలానికి పారిపోతూ పట్టుబడ్డాడు. ప్రస్తుతం కోర్టు అతడికి రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్ టీమ్ కుల్దీప్ ఇంట్లో ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా చుట్టుపక్కల సీసీటీవీ పుటేజీలను పోలీసులు జల్లెడ పట్టారు. పక్కా ఆధారాలతో ముఖేష్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి