Vaibhav Suryavanshi : ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న యూత్ వన్డేలలో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గడ్డపై పరుగులు వరద పారిస్తున్నాడు. మూడో వన్డేలో ఈ 14 ఏళ్ల కుర్రాడు కేవలం 31 బంతుల్లో 86 పరుగులు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వైభవ్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది సిక్స్ లు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 48 (19), 45 (34).. ఇప్పుడు 86 (31) పరుగులు చేశాడు. ప్రస్తుతం తను భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ యూత్ సెన్సేషన్ ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఎల్‌లో కూడా అదరగొట్టి, ఇప్పుడు అండర్-19 స్థాయిలో ఒకదాని తర్వాత ఒకటి రికార్డులను బద్దలు కొడుతున్నాడు.
తన ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ సూర్యవంశీ భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనాను బీట్ చేశాడు. భారత తరఫున అత్యంత వేగవంతమైన 50+ స్కోరులో బెస్ట్ స్టైక్ రేట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ 2000లో ఆస్ట్రేలియా అండర్-19పై 25 బంతుల్లో 58 పరుగులు (స్ట్రైక్ రేట్ 232) చేశాడు. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19పై 38 బంతుల్లో 90 పరుగులు (స్ట్రైక్ రేట్ 236.84) చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 277.41 స్ట్రైక్ రేట్‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నాడు. అతను 2016లో నేపాల్ అండర్-19పై 37 బంతుల్లో 78 పరుగులు చేశాడు.
రాబోయే మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, అతను యూత్ వన్డేలలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం, సర్ఫారాజ్ ఖాన్ పేరు మీద ఈ రికార్డు ఉంది. అతను 2013లో సౌతాఫ్రికా అండర్-19పై 15ఏళ్ల 338 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, అతను యూత్ వన్డేలలో సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా మారతాడు. బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హుస్సేన్ శాంటో పేరు మీద ఈ రికార్డు ఉంది. అతను 2013లో శ్రీలంక అండర్-19పై 14 సంవత్సరాల 241 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు.
యూత్ వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీని పాకిస్తాన్‌కు చెందిన కమ్రాన్ గులామ్ నమోదు చేశాడు. అతను 2013లో ఇంగ్లండ్ అండర్-19పై 53 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత తరఫున, రాజ్ అంగద్ బావా యూత్ వన్డేలలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ఈ ఆల్‌రౌండర్ 2022 అండర్-19 ప్రపంచ కప్‌లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ ప్రపంచ కప్‌ను భారతదేశం గెలుచుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..