రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నుంచి రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగనున్నట్టు అధికారులు వెల్లడించారు. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు పడేప్పుడు చెట్ల కింద నిల్చోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
మాన్‌సూన్ సీజన్ కావడంతో.. భారీ వర్షాలు, వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల వచ్చినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. ఎవరైనా అపాయంలో ఉంటే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.