జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సీటు ఖాళీ అయి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని సీటు కావడంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
టికెట్ రేసులో ఆ నలుగురు..!
ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీ లోపల మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు మహ్మద్ అజారుద్దీన్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. తనకు హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. రెండొవ పేరు నవీన్ యాదవ్.. గతంలో MIM తరఫున జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత. తనకు ఓ అవకాశం ఇస్తే గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. ఇక మూడో పేరు విజయారెడ్డి.. ఖైరతాబాద్ కార్పోరేటర్, పీజేఆర్ కుమార్తె అయిన ఆమె కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నారు. వీళ్లతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా జూబ్లీహిల్స్ సీటుపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇటీవల యూసుఫ్‌గుడ, రెహమత్ నగర్‌లో పర్యటించి ప్రజలకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారని టాక్.
MIM కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందా?
జూబ్లీహిల్స్‌లో MIM ఓటు బ్యాంక్ బలంగా ఉంది. MIMతో స్నేహపూర్వక ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ సారి వాళ్ల మద్దతుతో గెలవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే MIM కూడా స్వయంగా అభ్యర్థిని నిలబెడతుందా? లేక కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా? అన్న విషయంపై అతి త్వరలో క్లారిటీ రానుంది. ఇంతకుముందు రెండు సార్లు BRS ఈ సీటు గెలిచింది. ఇలాంటి చోట ఎలాగైనా గెలిచి BRSను ప్రజలు నమ్మడం లేదని ప్రూవ్ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా “గ్రేటర్‌లో కాంగ్రెస్ బలపడుతోంది” అనే సంకేతాలు పంపొచ్చన్నది ఆయన ప్రణాళిక అని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. మొత్తానికి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓ రిప్యుటేషన్ యుద్ధంగా బరిలో దిగుతోంది. మరి ఫైనల్‌గా ఎవరు బరిలోకి దిగుతారు? MIM ఎటువైపు మొగ్గుతుంది? ఈ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి