స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఏఐసీసీ పెద్దలను కూడా కోరినట్లు, వారికి లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
హైలైట్:
- వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ షర్మిల
- తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు షర్మిల
- వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటుపై రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్సార్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్మృతి వనం ఏర్పాటు గురించి ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సందర్భానుసారంగా స్పందిస్తోంది. తాజాగా కరేడు రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా.. వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కరేడులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.