రుతుపవనాలు విస్తరించినా.. వరుణ దేవుడు కరుణించడం లేదు.. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.. వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.. వర్షం కోసం వలస దేవరలు ఏర్పాటు చేసుకున్న గ్రామాలు వలసదారి పట్టాయి. శాంతిపురం మండలంలోని 5 గ్రామాలు ఖాళీ చేసి అడవిలోకి వెళ్ళిన గ్రామాల ప్రజలు అక్కడే బస చేశారు.. వర్షం కోసం.. దేవదేవతల కరుణ తమపై ఉండాలని.. 12 ఏళ్లకో సారి వలస వెళ్లే ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు.. అలానే.. ఈ సారి కూడా ఈ గ్రామాలు ఈ వింత ఆచారాన్ని కొనసాగించాయి. మునెప్ప దేవర పేరుతో రెండ్రోజులు పాటు గ్రామం విడిచి అడవిలోకి వెళ్ళి పూజలు, సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు.. ఈ మేరకు ముందుగా గ్రామంలోకి ఎవరూ రాకుండా ఏకంగా గ్రామానికి తాళం వేశారు. రెండ్రోజులపాటు గ్రామానికి ఎవరూ రాకుండా గ్రామ సేవకుడిని కాపలా పెట్టారు. గ్రామంలో జనంతో పాటు పశువులు పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన పాటించారు. చంటి బిడ్డల నుంచి వృద్ధులు.. ఇలా అందరూ గ్రామం నుంచి బయటికి వచ్చాక.. ఎవరు ఊర్లోకి వెళ్లకుండా ముళ్ళకంప వేసి అడవిలోకి వెళ్లారు..
వలస వెళ్లిన వారంతా ఒకచోట చేరి మట్టితో వరుణ దేవుడిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. దేవతల కృప తమపై ఉంటుందని గ్రామస్థులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చాలా చోట్ల ఇలాంటి సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో ఇలాంటి సంబరాలు, ఆచారాలు పాటిస్తున్నా క్రమంలో.. బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా గ్రామానికి చేరుకొని దేవర నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటుతున్నారు.
వీడియో చూడండి..
వలస దేవరలు అంటే..
వలస దేవరలు అంటే వలస వెళ్ళే ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న దైవాలు లేదా దేవతలు. వీరు వలస వెళ్ళే వారిని కాపాడతారని, వారికి సహాయం చేస్తారని విశ్వాసం.. ఇలా వీరంతా అడవి బాట పడితే.. ఆ సమయంలో దేవతలు గ్రామంలో సంచరిస్తారన్న నమ్మకం గత శతాబ్దాలుగా కొనసాగుతోంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..