
హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై సర్కార్ సీరియస్ అయింది.. మూడు కల్లు కాంపౌండ్లు సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కూకట్‌పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇంద్రహిల్స్, కె.పి.హెచ్.బి ఉషాముళ్లపూడి రోడ్డులోని కల్లు కాంపౌండ్‌లలోకల్లు తాగి దాదాపు 20మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందాడు. గాంధీలో చికిత్స పొందుతూ.. స్వరూప అనే మహిళ చనిపోయింది. కల్తీ కల్లు ఘటనలో హైదర్‌నగర్‌లో మరో ఇద్దరికి అస్వస్థతగురయ్యారు. జగన్, లక్ష్మమ్మ అనే ఇద్దరికి వాంతులు, విరేచనాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి.. అందరినీ హాస్పిటల్స్‌కు తరలించామన్నారు. కల్తీ కల్లుతో 19మంది అస్వస్థతకు గురయ్యారని.. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
వాస్తవానికి కల్లు అనగానే పల్లెటూళ్లు గుర్తుకొస్తాయి. తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లు ప్రజలు తాగి ఆస్వాదిస్తుంటారు, కల్లుతాగితే మంచిదని కూడా కొంతమంది చెబుతుంటారు. పల్లెల్లో సరే.. పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చిన వారి కోసం నగరాల్లో కల్లు కాంపౌండ్లు వెలిశాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కల్లు సేకరించి ఆయా ప్రాంతాల్లో విక్రయిస్తారు. అయితే కల్లు కాంపౌండ్ నిర్వాహకుల కాసుల కక్కుర్తి కల్తీ కల్లు దారుణాలకు కారణమవుతోంది. సాధారణంగా చెట్టు నుంచి తీసిన కల్లు మంచింది.. కానీ కృత్రిమంగా తయారు చేసిన, రసాయనాలు కలిపిన కల్లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.
కల్లును కల్తీ చేసేందుకు ఏం కలుపుతారో తెలుసా..
సాధారణంగా కల్లును పలచగా చేసి ఎక్కువ క్వాంటిటీ కోసం నీళ్లను విరివిగా కలుపుతారు. వాటర్ మిక్స్ చేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది కక్కుర్తితో ప్రమాదకర, నిషేధిత రసాయనాలు కలుపుతున్నారు. టేస్ట్ కోసం.. కల్లు తాగే వారికి ఎక్కువ కిక్కు ఇచ్చేందుకు ఇలాంటి కల్లు కల్తీ చేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. కల్తీ కల్లులో అల్ప్రజోలం, క్లోరోహైడ్రేట్, డయాజెపామ్ వంటి మత్తు పదార్థాలు మిక్స్ చేస్తున్నారు. ఇలాంటివి మిక్స్ చేస్తే కల్లు తాగిన వారి ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా మోతాదుకు మించి రసాయనాలు కలిపినప్పుడు కల్లు తాగిన బాధితులు వాంతులు, విరేచనాలతో తీవ్రఇబ్బందులు పడుతూ అస్వస్థతకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీలపై ప్రభావం పడి మరణిస్తారు. కల్తీ కల్లు బాధితుల్లో ఎక్కువ మందికి నరాలపై తీవ్రప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
కల్లు కాంపౌండ్ నిర్వాహకుల కాసుల కక్కుర్తి కొన్ని కుటుంబాల ఉసురు పోసుకుంటుంది. ఇలాంటి వాటిపై ఎక్సైజ్ శాఖ దాడుల జరిపి కల్తీ కల్లు వ్యవహారాన్ని నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. కల్లు కాంపౌండ్ లలో తాగేది ఎక్కువ మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం చేసి వచ్చే పేద ప్రజలే కావడంతో వారంతా కల్తీ కల్లు బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.. కావున భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..