AP Cabinet Meeting: మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఏపీఎండీసీ బాండ్లు కొనొద్దంటూ పలు కంపెనీలకు మెయిల్స్ పంపారంటూ మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీంతో ఈ అంశం మీద సీరియస్ అయిన చంద్రబాబు.. విచారణకు ఆదేశిస్తామని స్ఫష్టం చేశారు.

మరోవైపు మంత్రులపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరూ కూడా సంతృప్తికరంగా పనిచేయడం లేదని అన్నట్లు సమాచారం. ఓ మహిళా ఎమ్మెల్యేను కించపరిచేలా, అభ్యంతరకరంగా మాట్లాడితే మంత్రులు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే దానిపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏడాదిలో నిత్యావసర ధరలు తగ్గించామన్న చంద్రబాబు.. ఈ విషయాన్ని మంత్రులు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) బాండ్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ బాండ్లలో పెట్టుబడులు వద్దంటూ వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 కంపెనీలకు మెయిల్స్ చేయించారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల ఆరోపించారు. అయితే కంపెనీలు చంద్రబాబు మీద నమ్మకంతో వాటిని పట్టించుకోకుండా బాండ్లు కొనుగోలు చేశాయన్నారు. ఉదయ్ భాస్కర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని.. వైఎస్ జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను కూడా విచారించాలని పయ్యావుల కేశవ్ చంద్రబాబును ఇటీవల కోరారు. తాజాగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రాగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.