ఏపీలో త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరసాపురం – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బుధవారం వెల్లడించారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో నరసాపురం – అరుణాచలం ప్రత్యే రైలును భూపతిరాజు శ్రీనివాసవర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మరోవైపు ఏపీ మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటోంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:45 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 2:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 35 నిమిషాలలో చేరుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరితే.. అదే రోజు రాత్రి 11:35 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
వందే భారత్ రైల్లో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. సీటు ఇవ్వలేదని ప్రయాణికుడ్ని కొట్టి
మరోవైపు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య మరోన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. ఈ రైలు గురువారం తప్ప వారంలో మిగతా ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రబాద్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరితే.. అదే రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరితే.. రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.మరోవైపు విజయవాడ – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. బుధవారం తప్ప వారంలో మిగతా రోజులు ఈ విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. 517 కి.మీ. దూరాన్ని 6 గంటల 40 నిమిషాలలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరితే.. రాత్రి 10:00 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై నుంచి ఉదయం 5:30 గంటలకు చెన్నై విజయవాడ వందే భారత్ రైలు బయల్దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
వీటితో పాటుగా విశాఖపట్నం – భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దుర్గ్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏపీ మీదుగా నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ – బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కించే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.