బ్రెజిల్ టూర్ ముగించుకుని నమీబియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. నమీబియా అధ్యక్షురాలు నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించిది. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ పురస్కారాన్ని అధ్యక్షురాలు నెతుంబోతో నుంచి ప్రధాని మోదీ అందుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ నమీబియా పార్లమెంట్‌లో ప్రసంగించారు. భారత్ – నమీబియా మధ్య దౌత్య సంబంధాలను.. సంప్రదాయాలను ప్రధాని మోదీ వివరించారు.
కాగా.. ఈ వీదేశీ పర్యటనలో ప్రధాని మోదీ.. పలు అత్యున్నత పురస్కారాలను అందుకోవడంతోపాటు.. మూడు పార్లమెంట్‌లలో కీలక ప్రసంగాలు చేశారు. గతంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో 27 అవార్డులు అందుకోగా.. ప్రస్తుత ఐదు దేశాల టూర్‌లో నాలుగు పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
నమీబియా పర్యటనలో మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ సామ్ నుజోమాకు ప్రధానిమోదీ నివాళులర్పించారు. నమీబియా గడ్డపై అడుగుపెట్టిన మోదీకి సంప్రదాయ నృత్యంతో అక్కడి కళాకారులు స్వాగతం పలికారు. డోలు వాయిస్తూ వారిని ఉత్సాహపరిచారు ప్రధాని మోదీ.
ఎనిమిదిరోజుల్లో ఐదు దేశాల్లో పర్యటించారు ప్రధాని. నమీబియా పర్యటనతో ఆయన విదేశీ టూర్ ముగుస్తోంది. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో మోదీ పర్యటించారు. బ్రెజిల్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.