
పేదరికంలో పుట్టిన ఆ యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నిలిచింది. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవని స్థితి నుండి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంకు చెందిన రెడ్డి భవాని.. దేశం తరపున ఏషియన్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టి మూడు బంగారు పతకాలు సాధించింది. రెడ్డి భవాని తండ్రి రెడ్డి ఆదినారాయణ ఒక సామాన్య తాపీ మేస్త్రి. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవడం కష్టం. చిన్నతనం నుంచి తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను చూసిన భవానీ ఎలాగైనా కష్టాల నుండి బయటపడాలని అనుకుంది. అందుకోసం ఏమి చేయాలా అని నిరంతరం ఆలోచించింది. ఈ క్రమంలోనే వెయిట్ లిఫ్టింగ్‌లో ఉన్నత స్థాయికి చేరిన పలువురు క్రీడాకారులు గుర్తుకు వచ్చారు. వారి స్పూర్తితో తాను కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని నిర్ణయించుకుంది.
తాను వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు ఒక కోచ్ కోసం అన్వేషించింది. ఆ సమయంలో గాదిపల్లి ఆనంద్ అనే కోచ్ భవానికి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆనంద్.. భవానిని తన సొంత సోదరిలా ఆదరించి, ఆమెకు వెయిట్ లిఫ్టింగ్‌లో అవసరమైన సలహాలు, సహాయాన్ని అందించాడు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణ, కష్టపడేటత్వం ఉన్న భవాని కఠోర శిక్షణ పొందింది. ఆమెకు తగ్గట్టు ఆనంద్ ఆమెను నిరంతరం ప్రోత్సహిస్తూ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఈ కృషి ఫలితంగానే ఆమె ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించి, దేశ ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
భవాని తన అసాధారణ ప్రతిభ, కఠిన శ్రమతో ఈ అసామాన్య విజయాన్ని అందుకుంది. ఆదినారాయణకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన మొదటి కూతురి వివాహం కోసం ఇల్లు అమ్మాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆయన రెండవ కూతురు భవానిని మాత్రం వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రోత్సహించడంలో వెనుకడుగు వేయలేదు. ఆయన నిరంతరం భవాని విజయానికి అండగా నిలిచారు. ఇప్పుడు భవాని సాధించిన విజయంలో కోచ్ ఆనంద్, తండ్రి ఆదినారాయణ పాత్ర కీలకమని చెప్పొచ్చు. భవాని అంతర్జాతీయస్థాయిలో సాధించిన విజయానికి జిల్లావాసులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..