విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం గోవింద నామ స్మరణతో మారుమోగుతోంది. గిరిప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గిరిప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తొలిపావంచా దగ్గర ప్రారంభమైన గిరి ప్రదక్షిణ.. అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, NAD జంక్షన్, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా సింహాచలం అప్పన్న ఆలయం వరకు కొనసాగుతుంది. రేపు తెల్లవారుజామువరకు భక్తులు గిరిప్రదక్షిణ చేయనున్నారు. గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నస్వామివారికి తుది విడత చందనోత్సవం జరగనుంది.
ఇక.. సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీసు అధికారులు గిరి ప్రదక్షిణను పర్యవేక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..