హైదరాబాద్, జులై 10: కూకల్‌పల్లిలో కలకలం రేపిన కల్తీ కల్లు వ్యవహారంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. సోమవారం రాత్రి కూకట్‌పల్లి, కెపీహెచ్‌బీలకు చెందిన 5 కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు సేవించి ఐదుగురు మరణించారు. మరో 31 మంది ఆసుపత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన తాపీమేస్త్రీ సీతారాం (47), హైదర్‌నగర్‌కు చెందిన గృహిణి స్వరూప (61) ఉన్నారు. కూకట్‌పల్లిలో మరణించిన మరో ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. వీరు సేవించిన కల్లులో క్రియాటిన్ స్థాయిలు భారీగా పెరగడం వల్లనే మరణాలు సంభవించినట్లు దర్యాప్తులో తేలింది. దేవదాస్, కృష్ణయ్యకు డయాలసిస్ చేయాలని నిర్ణయించారు. మరో బాధితుడు మోనప్పను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కల్తీ కల్లు నిర్వాహకులపై బాలానగర్ అబ్కారీ ఠాణాలో 5 కేసులు, కెపీహెచ్బీ పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు నమోదయ్యాయి. చింతకిబ్ధి నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, కె. కుమార్ గౌడ్, తీగల రమేష్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, 5 కల్తీ కల్లు కేంద్రాలను ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. దాదాపు 674 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేసింది.
ఆదివారం, సోమవారం కల్లు తాగిన కొద్దిసేపటికే బాధితులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. బాధితుల్లో ఎక్కువ మంది తరచూ కల్లు తాగుతుండడంతో వికారం వల్ల ఇలా జరిగి ఉంటుందని భావించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఉదయం ఆసుపతుల్లో ఒక్కొక్కరుగా చేరడం ప్రారంభించారు. హైదర్‌నగర్ రాందేవ్‌రావు ఆసుపత్రిలో ఒకేసారి 15 మంది బాధితులు చేరారు. పరిస్థితి తీవ్రత గమనించిన అధికారులు మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరికి శవపరీక్షలు నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వర్గాలు కల్లులో ఆల్ప్రజోలం కలిపినట్లు తెలిపారు. FSL నివేదికల వచ్చిన తర్వాతగానీ అసలు కారణం తెలుస్తుందని అన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 31కి చేరింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోగుల్లో కొందరు వెంటిలేటర్‌పై ఉండగా, ఆరుగురికి డయాలసిస్ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మరికొందరు ఫ్లూయిడ్ రిససిటేషన్ చేయించుకుంటున్నారు. మరోవైపు రసాయన కల్తీ కల్లును నిర్ధారించడానికి తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB) బాధితుల నుంచి మూత్ర నమూనాలను కూడా సేకరించింది. బుధవారం ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రోగులను పరామర్శించారు. ఈ వ్యవహారంలో లింకులు ఉన్న సలు మద్యం డిపోలను అధికారులు సీజ్ చేసి, నమూనాలను ఎక్సైజ్ కెమికల్ ల్యాబ్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపారు. వీరిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు, లైసెన్స్ రద్దుకు ఉపక్రమించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.