Duvvada Srinivas On Chiranjeevi: వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన విషయాలు వెల్లడించారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆర్ధికంగా నష్టపోతే, చిరంజీవి సహాయం చేశారని తెలిపారు. అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని చిరంజీవితో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చిరంజీవి సీఎం అయ్యేవారని దువ్వాడ అభిప్రాయపడ్డారు.
హైలైట్:
- దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
- 2009 పరిస్థితుల గురించి ప్రస్తావన
- న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు

‘ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో నాకు చిరంజీవి కబురు పెట్టారు.. అప్పటి నుంచి ఆయన్ను అన్నయ్య అని పిలిచాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు 200 వాహనాలతో తిరుపతికి ర్యాలీగా వెళ్లాము. ఆ కార్యక్రమంలో నాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు.. చిరంజీవిని ఇష్టపడతాను. మా జిల్లాలో చాలామంది ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చేరిన తర్వాత నాకు టికెట్ రాకుండా ప్రయత్నం చేశారు. చిరంజీవి రమ్మన్నారు వచ్చాను.. అన్నయ్య నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదేమో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలో శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకపోతే అర్ధం లేదని చిరంజీవి అన్నారు. అప్పుడు అధిష్టానం నుంచి నాకు బీఫామ్ తీసుకుని వచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీచేసి 3,500 ఓట్లతో ఓడిపోయాను. అచ్చెన్నాయుడు, రేవతిపతి, నా మధ్య పోటీ జరిగింది’ అని చెప్పుకొచ్చారు.
డ్యాన్స్‌తో అదరగొట్టిన దువ్వాడ, దివ్వెల మాధురి జంట.. అబ్బో ఓ రేంజ్‌లో ఇరగదీశారు కదా
‘టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న రేవతిపతి గారు చనిపోయారు.. ఉప ఎన్నిక వచ్చింది. శ్రీనివాస్ పోటీ చేయాలని చిరంజీవి చెప్పారు. నేను టెక్కలి వస్తాను.. ప్రచారం చేస్తానని చెప్పారు. నా నామినేషన్ కోసం చిరంజీవి స్వయంగా వచ్చారు. నేను ప్రజారాజ్యం పార్టీలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన తర్వాత మూడు, నాలుగు రోజులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. అన్నయ్య రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం అని చెప్పాను.. అప్పుడు ఉప ఎన్నిక నుంచి వెనక్కు తగ్గాము.. పోటీచేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవతిపతి భార్య భారతికి వేయమని మద్దతు తెలిపాను’ అని వివరించారు.