
అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తన పార్టీ ఘోర ఓటమి తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యారు. అవినీతి అంతం చేస్తామని పార్టీ పెట్టిన ఆయన.. అదే అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లడం గమనార్హం. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు కేజ్రీవాల్. ఈ క్రమంలో ఓ సభలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తన పాలనకుగానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని అన్నారు. ‘‘ది కేజ్రీవాల్ మోడల్’’ అనే పుస్తకం పంజాబీ ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం తన పనిని పదే పదే అడ్డుకోవాలని చూసినా.. తాము సమర్ధంగా పనిచేశామన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమ పథకాలను వ్యతిరేకించి, ఎన్నో ఇబ్బందులు పెట్టినా.. ప్రజలకు మంచి పాలన అందించామని.. అందుకు గానూ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పారు.
గత ప్రభుత్వాలు నిధులు లేవని చెప్పినా.. ఢిల్లీలో విద్యావ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆప్‌దే నని కేజ్రీవాల్ అన్నారు. గత ప్రభుత్వాల అవినీతిని అరికట్టడం వల్లే పేదలకు ఉచిత విద్యుత్‌తో పాటు ఎన్నో పథకాల అందించామని చెప్పారు. ప్రస్తుత బీజేపీ నేతలు దోపిడిపై తప్ప.. ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టడం లేదని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేశారని.. ఉచిత విద్యుత్, 20వేల లీటర్ల ఉచిత నీరు పథకాలను సరిగ్గా అమలుచేయడం మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అవినీతిలో కేజ్రీవాల్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ సెటైర్ వేసింది. కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని అనడం హాస్యాస్పదమని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. అసమర్థత, అరాచకం, అవినీతి అనే విభాగాలు ఉంటే కేజ్రీవాల్‌కు కచ్చితంగా నోబెల్ బహుమతి వచ్చేదని ఎద్దేవా చేశారు. ఆప్ పాలనలో జరిగిన కుంభకోణాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పారు. తన అధికార నివాసం కోసం కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. అయితే ప్రజలు బీజేపీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని.. వీరేంద్ర మాటలు ఆపి చేతల్లో చూపించాలని మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…