రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా. ట్రంప్ రాజా తలచుకుంటే సుంకాలకు కరువా. టారిఫ్‌ల కొరడాతో ఛెళ్లుఛెళ్లుమని బాదేస్తున్న అమెరికా అధ్యక్షుడు.. బ్రెజిల్‌కి బంపరాఫర్ ఇచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఆ దేశంపై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. మీటింగ్ పెట్టినందుకు, తనను తిట్టినందుకు పన్నులేశారంటే బాగోదుగా.. అందుకే మరో సాకు వెతుక్కున్నారు ట్రంప్.
నవ్విపోదురుగాక అన్నట్లే ఉంది ట్రంప్ వ్యవహారం. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోని వేధిస్తున్నారనే ఆరోపణలతో ఆ దేశంపై 50 శాతం సుంకం విధించారు. ఈమధ్యే అమెరికా విధానాలను వ్యతిరేకించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం అదనపు సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనికి బ్రెజిల్ ప్రెసిడెంట్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ట్రంప్ ఇగో హర్ట్ అయింది.
బ్రెజిల్‌పై విధించిన 50 శాతం సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. స్వేచ్ఛా ఎన్నికలపై బ్రెజిల్ దాడులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్.. దీనికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బోల్సోనారోపై జరుగుతున్న విచారణని నిలిపివేయాలని డిమాండ్‌చేశారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై ఎంక్వయిరీ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే కెనడా తర్వాత అమెరికాకు అతిపెద్ద ఉక్కు ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్.. ట్రంప్ చర్యలను చట్టపరంగానే ఎదుర్కుంటామంటోంది.
మరోవైపు.. బ్రెజిల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం బోల్సోనారోకు మద్దతు ప్రకటించింది. బోల్సోనారో, ఆయన కుటుంబసభ్యులు అమెరికాకు బలమైన భాగస్వాములని ఓ ప్రకటన విడుదల చేసింది. వారిపై, ఆయన అనుచరులపై జరుగుతున్న రాజకీయ హింస సిగ్గు చేటని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను అగౌరవపరచడమేనని విమర్శించింది. దీన్ని బ్రెజిల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రకటనపై విచారణకు రావాలని యూఎస్ రాయబారిని ఆదేశించింది.
2020లో బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓడిపోయారు. ఆ సమయంలో దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడితో పాటు మరో 33 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. అక్కడి సుప్రీంకోర్టు ప్యానెల్‌లో జరుగుతున్న విచారణలో కుట్ర నిజమని తేలితే శిక్ష పడుతుంది.