
గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్త, వ్యర్ధ పదార్ధాలను తొలగించేందుకు పంచాయితీ రాజ్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్దతి ప్రకారం సేకరించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చన్న భావనతో పంచాయితీ రాజ్ శాఖ పనిచేస్తుంది. ఇందులో భాగంగానే స్వచ్చ రథాన్ని సిద్దం చేసింది. గ్రామాల్లో వ్యర్థాలను సేకరించి ఉల్లిపాయలు ఇచ్చే ఆటోలు, డబ్బులు ఇచ్చేవాళ్లను చూస్తుంటాం. వాళ్లని చూసి ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది.
గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో స్వచ్చరథం తిరుగుతూ ఉంటుంది. ఇళ్లలోని ప్లాస్టిక్, అట్టపెట్టెలు, పుస్తకాలు, పేపర్లు, పాత ఇనుము, అల్యూమినియం స్వచ్చరథం వద్దకు తీసుకొచ్చి ఇస్తే వాటికి ధర నిర్ణయిస్తారు. ఎంత ధర వచ్చిందో అంత మేరకు స్వచ్చరథంలోని నిత్యావసర వస్తువులు ఇస్తారు. ఇప్పటికే ఈ రథాన్ని లాలుపురం గ్రామంలో తిప్పుతున్నారు. పాత ఇనుము కేజీ 20 రూపాయలు చెల్లిస్తుండగా.. ప్లాస్టిక్‌కు కేజీ ఇరవై రూపాయలు చెల్లిస్తున్నారు. అల్యూమినియంకు అత్యధికంగా కేజీకి 120 రూపాయలు ఇస్తుండగా.. స్టీల్ వస్తువులకు 40 రూపాయలు ఇతర పేపర్లు, పెట్టెలకు పది రూపాయలు ఇస్తున్నారు. అయితే వీటికి డబ్బుుల ఇవ్వరు. డబ్బులకు సమానమైన నిత్యవసర వస్తువులు అందిస్తారు. పదిహేడు రకాల నిత్యవసర వస్తువులు అందుబాుటలో ఉంచారు. కందిపప్పు, మినప గుళ్లు, గోధుమ పిండితో పాటు ఉల్లి పాయలు ఇస్తారు. వీటి ధరలను స్వచ్చరథంలోనే ప్రదర్శనకు ఉంచుతారు. వ్యర్థాలను తీసుకొచ్చి వాటి ధరకు సమానమైన నిత్యవసర వస్తువులను తీసుకెళ్లవచ్చు.
ఈ ప్రక్రియ ద్వారా గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా చేయడమే కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను క్రమ పద్ధతిలో రీసైక్లింగ్‌కు పంపించవచ్చని పంచాయితీ రాజ్ శాఖ ఆలోచన చేసింది. పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ క్రిష్ణతేజ స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మొదట పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి తర్వాత కాలంలో రాష్ట్రమంతా అమలు చేసేందుకు పంచాయితీ రాజ్ అధికారులు సిద్దమయ్యారు. ప్రస్తుతానికి గ్రామాల్లో స్థానికులు నుంచి మంచి స్పందనే లభిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..