ఇళ్లను జాకీల సాయంతో లిఫ్ట్ చేసి ఎత్తు పెంచడం తెలిసిందే. తమిళనాడులో తొలిసారిగా ఆలయాలను కూడా ఇలా లిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు లోతట్టుగా మారిపోవడంతో వర్షాకాలంలో ముంపు సమస్య చుట్టుముడుతోంది. దీంతో అటు భక్తులు.. ఇటు కమిటీలు ఆందోళన చెందుతున్నాయి.. ఈ తరుణంలో అలాంటి సమస్య నుంచి బయటపడేందుకు పలు ఆలయ కమిటీలు లిఫ్ట్ పద్దతిని అనుసరిస్తున్నాయి. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతి తీసుకుని ఇప్పటికే 15 ఆలయాల ఎత్తు పెంచాయి. ఈ పనులను మామచంద్ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతోంది.
చెన్నైలోని పురాతన ఆలయాల్లో మధ్య కైలాష్ ఆనంద వినాయకర్ గుడి ఒకటి. సర్దార్పటేల్ రోడ్డు, ఓల్డ్ మహాబలిపురం రోడ్ల మలుపులో ఉన్న ఈ ఆలయం ముంపులో ఉంది. రహదారితో పోల్చితే లోపలున్న ప్రధాన, ఉప ఆలయాలు ఆరు అడుగుల కింద ఉండటంతో పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఆయా సమయాల్లో పూజా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో ముంపు నుంచి బయటపడేలా కొద్దినెలలుగా ప్రాంగణంలోని 12 ఆలయాల ఎత్తును ఆరు అడుగుల మేర పెంచే పనులు జరుగుతున్నాయి. అంబళ్, వీరాంజనేయ, నవగ్రహ, శివుని ఆలయాల పనులు పూర్తవగా ప్రధాన రాజగోపురం, వినాయక ఆలయాన్ని అడుగు మేర ఎత్తారు. మొత్తంగా 25 శాతం పనులు పూర్తయ్యాయి. ఇదే తరహాలో చెన్నై వ్యాసర్పా డిలోని రవీశ్వరార్, పన్రుట్టిలోని సోమేశ్వరర్, కోవిలంబాక్కం బాలగురునాథస్వామి ఆలయాల పనులు కొనసాగుతున్నాయి.
వీడియో చూడండి..
ఆలయాల ఎత్తు పెంచేందుకు.. పునాదుల మీద జాకీల్ని అమర్చి, ఆలయాల్ని ఒక్కో అడుగు చొప్పున పైకి ఎత్తుతూ నిర్మాణాలు చేపడుతున్నారు.. చెంగల్పట్టు సింగపెరుమాల్ కోయిల్లో 1500 ఏళ్ల క్రితం పల్లవరా జులు నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయాన్ని అక్కడి పరిస్థితులకు తగ్గట్లు ఆరు అడుగుల మేర పైకి తీసుకొచ్చారు.. పునాదిపైన, గోడ మధ్యలో బెల్ట్ తరహాలో పటుత్వం వచ్చేలా రెండంచెల బెల్ట్బమ్ కాంక్రీట్ సాంకేతికతను వాడుతూ.. ఆలయాల ఎత్తు పెంచుతున్నామని.. దీంతో గోడ దృఢంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో వర్షాలకు నీరు లోపలికి వెళ్లదని మామచంద్ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సురేందర్ కుమార్ తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..