విజయవాడలో ఒక కుక్క కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక యువకుడు తన పెంపుడు కుక్కను జాగింగ్‌కు తీసుకురాగా, అది కాలేజీకి వెళ్లే యువతిపై మొరిగింది. కుక్కను నియంత్రించకపోవడంతో యువతి, ఆమె తాత ఆగ్రహించి గొడవకు దిగారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది, అయితే ఇంత చిన్న విషయానికే ఇంత గొడవ పడతారా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ పటమట ప్రాంతంలో ఉండే ఓ కుటుంబం ఓ పెంపుడు కుక్కను పెంచుకుంది. ఎంతలా అంటే తమ కుటుంబంలో సభ్యుడిగా చేసుకుంది. అయితే ఆ కుక్క కారణంగానే తమకు ఇబ్బందులు వస్తాయని ఊహించలేకపోయింది. అదే ప్రాంతంలో మరో ఫ్యామిలీ ఉంటోంది. ఆ ఫ్యామిలీలో కాలేజీకి వెళ్లే యువతి ఉంది. ఆ యువతిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు ఆ ఇంట్లోని పెద్దాయన రోజూ బస్‍స్టాప్ వరకూ వస్తుంటారు. శనివారం కూడా అలాగే జరిగింది. మనవరాలిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు ఆ పెద్దాయన, మనవరాలితో కలిసి బస్టాండ్ వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో మన కథలోని కుక్కను వెంటబెట్టుకుని ఓ యువకుడు జాగింగ్ చేస్తూ అక్కడకు వచ్చాడు.
అయితే అప్పుడే అనుకోని ఘటన జరిగింది. కుక్క తన సహజస్వభావాన్ని బయటపెట్టుకుంది. అందరి మీదకు మొరుగుతూ వెళ్లినట్లుగానే.. ఆ కుక్క యువతిపైకి కూడా మొరుగుతూ వెళ్లింది. అయితే కుక్కను జాగింగ్ కోసం తీసుకువచ్చిన యువకుడు.. దానిని నియంత్రించకుండా నవ్వుతూ ఉండిపోయాడు. దీంతో ఆ యువతి, ఆమె తాతకు ఒళ్లుమండిపోయింది. యువకుడితో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారినట్లు.. రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దేశం మీద ఇన్ని సమస్యలు ఉంటే.. ఇంత చిన్న విషయానికి గొడవపడాలా అని నోరెళ్లబెడుతున్నారు. ఓ కుక్క కారణంగా రెండు వర్గాల గొడవపడ్డాయని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.