
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, మనస్సు శుద్ధి అవుతాయని పెద్దలు చెబుతుంటారు. డైలీ 2 పూటల స్నానం చేస్తే.. చాలా సమయం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. వివిధ శుభ దినాలలో.. పాప విముక్తి కోసం ప్రజలు పుణ్య నదులకు వెళ్లి స్నానం కూడా చేస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్. అతను బకెట్ల కొద్దీ పాలతో స్నానం చేశాడు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. సదరు వ్యక్తి ముకల్మువా నివాసి అయిన మాణిక్ అలీగా తెలుస్తోంది. మాణిక్ మనస్సు ప్రస్తుతం స్వేచ్ఛగా, సంతోషంగా ఉందట. అందుకు కారణం అతను ఓ ఇబ్బందికర బందనం నుంచి విముక్తి పొందడమేనట. ఇంతకీ దేని నుంచి ఆ విముక్తి అనుకుంటున్నారు కదా..! అక్కడికే వస్తున్నాం. మాణిక్‌కు తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు మంజూరయ్యాయట. దీంతో అతను పట్టరాని సంతోషంతో.. తన మనసు ఇప్పుడు ఎంతో తేలికగా ఉందని చెబుతున్నాడు. అందుకే పాలతో స్నానం చేశాడు. తనకు పాప విముక్తి దొరికిందని గొప్పలు పోతున్నాడు.
తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని మాణిక్ ఆరోపిస్తున్నాడు. తన భార్య తన ప్రియుడితో రెండుసార్లు పారిపోయిందట. ఆమెకు లేచిపోవడం.. తిరిగి రావడం నిత్యకృత్యంగా మారినట్లు చెబుతన్నాడు. తన ఏకైక కుమార్తె ముఖం చూసి.. ఆమెను పదే, పదే క్షమిస్తున్నా పద్దతి మార్చుకోవడం లేదని వాపోతున్నాడు. ఆమె కారణంగా తాను మానసిక క్షోభకు గురయినట్లు తెలిపాడు. ఆమె ప్రవర్తను భరించలేక చట్టబద్ధంగా విడాకులు ఇచ్చాడు. తన భార్యతో విడిపోయిన తర్వాత.. మాణిక్ ఇప్పుడు స్వేచ్ఛగా ఫీలువుతున్నాడు. తనకు బాధల నుంచి విముక్తి లభించిందని.. నాలుగు బకెట్లలో దాదాపు 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.
వివాహం ఓ పవిత్రమైన సంబంధం. కానీ ఆ సంబంధంలో నమ్మకం అనే పునాది బలహీనమైనప్పుడు… దానిని కొనసాగించడం కష్టం అవుతుంది. మాణిక్ విషయంలో కూడా అదే జరిగినట్లు అనిపిస్తుంది. అయితే విడాకుల తర్వాత మాణిక్ పాలతో స్నానం చేసిన సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..